
బీఆర్ ఎస్ అధినేత .. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేస్తున్న వెరైటీ కామెంట్స్ వార్తల్లో నిలుస్తున్నాయి. రాజకీయ నాయకులు గత కొన్ని సంవత్సరాలుగా పంచ డైలాగులు .. సినిమాటిక్ డైలాగులు చెబుతూ ప్రతి ఒక్కరి దృష్టిలో పడేందుకు ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో బిఆర్ ఎస్ కీలక నేత కేటీఆర్ తో పాటు హరీష్ రావు ముందు వరుసలో ఉంటారు అని చెప్పాలి. అయితే వాళ్లతో పోటీపడే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అన్ని కాపీ డైలాగులు వాడుతూ కాఫీ రాజకీయం చేస్తున్నారు అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గలో సాగుతుంది. ఇటీవల వైసిపి అధినేత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో జగనన్న 2.0 వస్తుంది ... అప్పుడు అందరి సంగతి చూస్తా అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వెంటనే కవిత తెలంగాణలో బీఆర్ఎస్ 3.0 కేసీఆర్ 3.0 గ్యారంటీ అని చెప్పారు. అప్పుడు ఉద్యమకారులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు.
తాజాగా ఆమె పింక్ బుక్ తెరమీదకు తీసుకువచ్చారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఆంధ్రప్రదేశ్లో రెడ్బుక్ అనే విషయం పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మంత్రి టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎప్పటినుంచో ఈ రెడ్ బుక్ తెరమీదకు తెచ్చారు. ఏపీ ప్రభుత్వంలో తమ పార్టీ నాయకులు కార్యకర్తలను వేధించిన వాళ్లను రాస్తామని .. అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు ఉంటాయని ప్రచారంలో హోరెత్తించారు లోకేష్. లోకేష్ అప్పుడు రెడ్ బుక్ అంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత పింక్బుక్ అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని వేధింపులకు గురి చేస్తుందో అన్ని వివరాలు పింక్ బుక్ లో రాసుకున్న తర్వాత అంతకు అంతకు చెల్లిస్తాం అంటూ కవిత వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా కవిత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను కాపీ కొడుతున్నారన్న చర్చలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.