పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుంభమేళాలో చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన తన సతీమణి అన్నా లెజ్నేవాతో కలిసి కుంభమేళాకు వెళ్లడం విశేషం. అసలు ట్విస్ట్ ఏంటంటే, పవన్ సతీమణి అన్నా లెజ్నేవా క్రిస్టియన్. సాధారణంగా ఇతర మతాల వారిని హిందూ సంప్రదాయాలకు దూరంగా ఉంచుతారు. కానీ అన్నా మాత్రం భర్తతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

కుటుంబం అంటే వెళ్తారు అనుకోవచ్చు, కానీ ఇక్కడ అసలు మ్యాటర్ వేరు. క్రైస్తవ మత పెద్దలు హిందూ ప్రసాదం తీసుకోవడానికి కూడా ఇష్టపడని రోజులు ఉన్నాయి. అలాంటిది, అన్నా స్వయంగా పుణ్యస్నానం చేయడం అంటే మామూలు విషయం కాదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి గంగానదిలో పుణ్యస్నానం చేయడం నిజంగా గొప్ప విషయం.

ఇక రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రకటనలు చేయకుండా, చాలా బాధ్యతాయుతంగా మాట్లాడారు. ఆయన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కుంభమేళాలో పవన్ కేవలం సందర్శకుడు మాత్రమే కాదు. అక్కడ జరిగిన త్రివేణి సంగమ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు, అకీరా నందన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆనంద్ సాయి వంటి వారితో కలిసి కుంభమేళాలో సందడి చేశారు.

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కుంభమేళా గురించి పవన్ మాట్లాడుతూ, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "నేను గతంలో యోగి ఆత్మకథ పుస్తకంలో కుంభమేళా గురించి చదివాను. గత మూడు దశాబ్దాలుగా కుంభమేళాను గమనిస్తున్నాను. ప్రతిసారి రావాలని అనుకున్నా కుదరలేదు. కానీ ఈ మహా కుంభమేళాకు రావడం చాలా ఆనందంగా ఉంది" అని పవన్ అన్నారు.

భారతీయులంతా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంటారని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఉద్ఘాటించారు. "భిన్న జాతులు, తెగలు, సంప్రదాయాలు ఉన్నా, సనాతన ధర్మం విషయంలో భారతీయులంతా ఒక్కటే. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా ఉందో, ధర్మం విషయంలో కూడా అదే ఏకత్వం కనిపిస్తుంది. వేల ఏళ్లుగా సనాతన ధర్మం వర్ధిల్లుతోంది, భవిష్యత్తులోనూ పరిఢవిల్లుతుంది" అని పవన్ అన్నారు.

దేశంలో సగం జనాభా కుంభమేళాకు తరలి రావడం గొప్ప విషయమని పవన్ కొనియాడారు. "ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఎక్కడా జరగలేదు. సనాతన ధర్మం ఆచరించే ప్రతి ఒక్కరికీ ఇది మహా పండుగ. దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించడం అద్భుతం" అని పవన్ అన్నారు.

అయితే, 50 రోజులుగా 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించిన ఈ మహా కుంభమేళాలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరగడం బాధాకరమని పవన్ అన్నారు. సనాతన ధర్మాన్ని నమ్మేవారిపై కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడటం బాధ్యతారాహిత్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మహా కుంభమేళాను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో నిర్వహిస్తోంది. భారీ జనం ఒకేచోట చేరినప్పుడు కొన్ని దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు, దాన్ని సనాతన ధర్మానికి ఆపాదించి, ఇష్టానుసారం మాట్లాడటం సరికాదు. ఇలాంటి దుర్ఘటనలు ఇతర మతాల కార్యక్రమాల్లో జరిగితే రాజకీయ నాయకులు ఇలాగే స్పందిస్తారా?" అని పవన్ ప్రశ్నించారు. "హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మ కార్యక్రమాలు జరిగితే వెంటనే మాట్లాడతారు" అంటూ పవన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: