
డాన్ అనే పాకిస్తానీ పత్రిక చెప్పిన ప్రకారం, జనం రోజంతా నది ఒడ్డునే తవ్వుతున్నారు. దొరికిన మట్టిని బకెట్లలో నింపుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఎలాగైనా సరే ఆ మట్టిలో నుంచి బంగారం వెలికితీయాలని బాగా ఆరాటపడుతున్నారు. జనం పోటెత్తడంతో ఈ వెతుకులాట మరింత ఊపందుకుంది.
పంజాబ్ మాజీ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకారం, ఈ ప్రాంతంలో దాదాపు 800 బిలియన్ రూపాయల విలువైన బంగారం నిల్వలు ఉండొచ్చట. ఆయన మాటలకు ఆధారం జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (GSP) రిపోర్ట్. నిజానికి మొదట్లో ఇక్కడ కొద్దిమంది మాత్రమే తవ్వకాలు చేసేవారు. కానీ ఇప్పుడు జనం సంఖ్య అమాంతం పెరిగిపోయింది.
నిపుణుల ప్రకారం, ఈ ప్రాంతంలో కనీసం 18 వేర్వేరు చోట్ల బంగారం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మురాద్ ప్రకారం, ఇక్కడున్న తొమ్మిది బ్లాకుల్లో ఒక బ్లాక్ లోనే దాదాపు 15500 కోట్ల రూపాయల విలువైన బంగారం ఉండొచ్చు. ఈ అంచనాలు నిజమైతే, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అవుతుంది.
ఇదివరకు పాకిస్థాన్ భారీ ముడి చమురు నిల్వలను కూడా కనుగొన్నట్లు చెప్పింది. ఇప్పుడు బంగారు నిక్షేపాలు కూడా వెలుగులోకి రావడంతో, ప్రకృతి పాకిస్థాన్‌ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి సహాయం చేస్తోందా అని చాలామంది అనుకుంటున్నారు. ఈ ఆవిష్కరణ ఆశలు చిగురింపజేసింది, కానీ ఎంత బంగారం వెలికితీయగలరు, దేశ ఆర్థిక వ్యవస్థపై ఇది ఎలా ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.