అంతేకాకుండా... యుద్ధానికి అసలు కారణం ఉక్రెయినే అని, పోరు మొదలుకావడానికి ముందే సంధి చేసుకుని ఉంటే ఆ దేశానికి అటువంటి నష్టం వాటిల్లేది కాదని అన్నారు. ఇవన్నీ తెలిసినా కూడా గత మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదో ఆ నేత ఖచ్చితంగా చెప్పాలి అని అన్నారు. "ఓ మోస్తరు పేరున్న హాస్యగాడు (జెలెన్‌స్కీ) అమెరికాతో మాట్లాడి 35,000 కోట్ల డాలర్లను యుద్ధంపై ఖర్చు అయ్యేలా చేసాడు. ఎందుకంటే ఇది ఎన్నటికీ గెలవలేని పోరు అని ఆయనికి బాగా తెలుసు. ట్రంప్ లేకుండా ఆ యుద్ధాన్ని కొలిక్కి తీసుకురాలేరు!" అని స్పష్టంచేశారు.
అంతేకాకుండా అమెరికా - రష్యా మధ్య సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న చర్చల్లో ఉక్రెయిన్‌ను భాగస్వామిని చేయకపోవడంపై వస్తున్న విమర్శలను ట్రంప్ కొట్టి పారేశారు. శాంతి చర్చల్లో పాల్గొనబోమని జెలెన్‌స్కీ చెప్పడమేమిటని ఈ సందర్భంగా మండిపడ్డారు. "ఉక్రెయిన్ భూమిని వారికి ఇప్పించేలా నా దగ్గర తగిన ఉపాయం ఉంది. సరిగ్గా ఆలోచిస్తే యుద్ధంలో ఒక్కరు కూడా చనిపోయేవారు కాదు. కానీ ఆనాడు బైడెన్ ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కాలేదు!" అని ట్రంప్ అన్నారు. అయితే ఈ యుద్ధాన్ని ఆపాలని రష్యా కోరుకుంటోందని, జెలెన్‌స్కీకి ప్రజామద్దతు 4 శాతమే ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా ఈ వ్యాఖ్యలను ఉక్రెయిన్ అధ్యక్షుడు ఖండించారు. రష్యా చేస్తున్న దుష్ప్రచారంలో ట్రంప్ జీవిస్తున్నారని కీవ్‌లో విలేకరులతో అన్నారు.