
అయితే.. విజయ్ సాయి రెడ్డి ఇటీవల పార్టీ నుంచి బయటికి వెళ్లడంతో పాటు.. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి.. పార్టీకి పెద్ద. ఆయన లీడర్ కాదు.. ఆయనకు పార్టీ బలవంతంగా నాయకత్వం ఇచ్చినా.. ఆయన దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు అంటూ వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ నేత ఎవరో కాదు విశాఖపట్నం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గణేష్ కుమార్.. అనంతరం వైసీపీకి దగ్గరయ్యారు.
గత ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో రాజకీయాలను రాంగ్ ట్రాక్‌లోకి తీసుకువెళ్లింది విజయసాయిరెడ్డి అని.. రుషికొండ భవనాలు కట్టాల్సిన అవసరం ఏముంది..? విశాఖలో 50 ఏళ్లుగా గొడవల్లో ఉన్న భూములలో ఆయన జోక్యం ఏమిటి..? రాజకీయ నేతకు అవి అవసరమా..? వివాదాల్లో ఉన్న స్థలాల పైకి ఎవరు వెళ్ళమన్నారు..? పార్టీ ఆయనకు ఏ బాధ్యతలు అప్పగించింది.. ఆయన చేసింది ఏమిటి..? దోచుకోవటం.. దాచుకోవటమా..? ఇప్పుడు ఆ కంపు పోయింది అంటూ వాసుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారాయి.