
వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురాం కృష్ణంరాజు ఒక్కటే ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రఘురామ ఈ ప్రచారాన్ని గత కొద్ది రోజులుగా గట్టిగా చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో త్వరలోనే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తుందన్న ప్రచారం గట్టిగా వినిపిస్తోంది .. గట్టిగా కనిపిస్తోంది. ఇటీవల మహా కుంభమేళాకు వెళ్లిన పులివెందుల ఇన్చార్జ్ బీటెక్ రవి, డిప్యూటీ స్పీకర్ రఘురామ ల మధ్య కూడా అక్కడ పులి వెందుల ఉప ఎన్నిక పై ఆసక్తికర సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని రఘురామ అంటే.. ఆ ఉప ఎన్నికకు మీరే ఇన్చార్జిగా ఉంటారని బీటెక్ రవి అన్న సంగతి తెలిసిందే.
ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల లో పులివెందులకు ఉప ఎన్నికలు వస్తే.. వైసీపీ నుంచి జగన్ మరోసారి పోటీ చేస్తారు. టీడీపీ నుంచి బీటెక్ రవి రేస్‌లో ఉంటారు. జగన్ గెలుపు విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. పులివెందుల అంటేనే వైఎస్సార్ ఫ్యామిలీ కి కంచుకోట అన్నది వేరే చెప్పక్కర్లేదు. ఇక్కడ నుంచి గతంలో వైఎస్సార్ వరుసగా గెలిచారు .. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ కూడా ఇక్కడ నుంచే గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. మధ్యలో వైఎస్. విజయలక్ష్మి తో పాటు వైఎస్ వివేక కూడా ఇక్కడ నుంచే అసెంబ్లీకి వెళ్లారు. ఇక్కడ జగన్ గెలిచినా .. జగన్ మెజార్టీ మాత్రం కచ్చితంగా భారీగా పడిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పులివెందులకు నిజంగానే బై ఎలెక్షన్ వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.