
వైసీపీ ఫ్లోర్‌లీడర్ మంత్రి రవికుమార్, కౌన్సిలర్లు మంత్రి ఉమామహేశ్వరి, తెలుగు బోధయ్య వంటి కీలక నేతలు ఎమ్మెల్యే బి.విజయచంద్ర సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లూ వైసీపీ గుప్పిట్లో ఉన్న పురపాలక పీఠం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది.
గత ఎన్నికల్లో వైసీపీ 22 స్థానాలతో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. టీడీపీ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. స్వతంత్రులు ఇద్దరు, భాజపా ఒక స్థానంలో గెలుపొందారు. అయితే, రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. కొద్ది రోజుల క్రితం నలుగురు వైసీపీ కౌన్సిలర్లు సైకిల్ ఎక్కేశారు. తాజాగా మరో ముగ్గురు జంప్ జిలానీ కావడంతో వైసీపీ ఒక్కసారిగా బలహీనపడింది. ఏకంగా ఏడుగురు కౌన్సిలర్లు పార్టీని వీడటంతో వైకాపా బలం 22 నుంచి 15కు పడిపోయింది.
ఇంకా 26వ వార్డు కౌన్సిలర్ బెలగాం కరుణ ఎటువైపు ఉంటారో తేల్చకుండా సస్పెన్స్‌లో పెట్టారు. ఆమె నిర్ణయం కీలకం కానుంది. ఆమె భర్త గత ఎన్నికల్లో తెదేపాకు మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు స్వతంత్రుల్లో ఒకరు ఇప్పటికే తెదేపా గూటికి చేరారు.
ఇది చాలదన్నట్లు ఎమ్మెల్యేకు ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు ఉండటం తెదేపాకు మరింత బలాన్ని చేకూర్చే అంశం. మొత్తానికి పార్వతీపురం పురపాలక పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తెదేపా వేగంగా పావులు కదుపుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు పార్వతీపురం రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి. మొత్తం మీద వైసీపీ ఈ బలహీన పడుతుండటం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలకు దారి తీస్తోంది. వచ్చే ఎన్నికలకు వైసీపీ అనే పార్టీ లేకుండా పోతుందా అనే కోణాల్లోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.