
ముఖ్యంగా కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారు అప్రమత్తంగా ఉండాలనేది సీనియర్ల సూచన. ఎందుకంటే, మీడియా సంస్థలు రోజుకో కథనాన్ని వండి వార్చి, మంత్రుల చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తాయి. ఒకసారి లొంగిపోతే అంతే. రోజూ ఏదో ఒక వివాదం, ఏదో ఒక ఆరోపణ.. మీడియా కథనాలకు స్పందించి, వెంటనే చర్యలు తీసుకుంటే, మరింత లోతుగా కూరుకుపోతారు.
చంద్రబాబు నాయుడు అనుభవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆయన హయాంలో కూడా ఇదే జరిగింది. మీడియాలో నెగిటివ్ కథనాలు రాగానే, ఆయన వెంటనే స్పందించేవారు. అధికారులపై చర్యలు తీసుకునేవారు. కానీ చివరికి ఏమైంది, చర్యలు తీసుకున్న అధికారులే బాధితులుగా మిగిలిపోయారు. మీడియా సంస్థలు మాత్రం క్రెడిబిలిటీ పెంచుకొని, పబ్బం గడుపుకున్నాయి. రాజకీయంగా చంద్రబాబుకు కూడా ఇది పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతోందట. కొత్త మంత్రులు మీడియా ట్రాప్‌లో చిక్కుకుంటున్నారట. ఇటీవల విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వ్యవహారం చూస్తే అదే అనిపిస్తోంది. మీడియాలో ఒక వార్త రాగానే, వెంటనే బిల్లులు ఆపేయమని ఆదేశాలు జారీ చేశారు. ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే, దీర్ఘకాలంలో ప్రభుత్వానికే నష్టం వాటిల్లుతుంది.
మీడియా అంటే పత్రికలు మాత్రమే కాదు. ఇప్పుడు డిజిటల్ మీడియా హవా నడుస్తోంది. కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు కుంభకోణాలకు కేంద్రంగా మారుతున్నాయి. డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని, ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేయడానికి సిద్ధపడుతున్నాయి.
కాబట్టి మంత్రులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీడియా వార్తలకు గుడ్డిగా స్పందించకుండా, వాస్తవాలు తెలుసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, నిదానంగా వ్యవహరించాలి. లేకపోతే, మీడియా ట్రాప్‌లో పడితే, రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ మంత్రులు మీడియా మాయాజాలం నుంచి బయటపడి, ప్రజలకు నిజమైన సేవ చేయాలి.