
ఉమ్మడి గుంటూరు జిల్లా.. తెనాలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి రాష్ట్రంలోని మంత్రిగా పనిచేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్.. గత ఎన్నికలలో తన సీటు త్యాగం చేశారు. తెనాలి నుంచి ఆయన పోటీ చేయాలని అనుకున్నారు. ఐదేళ్లపాటు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. అయితే కూటమి మిత్రపక్షంగా ఉన్న జనసేనకి తెనాలి కేటాయించారు. జనసేనలో కీలక నేతగా ఉన్న ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్ కోసం రాజా తన సీటు త్యాగం చేయక తప్పలేదు. కొన్ని రోజులు అలిగిన తర్వాత.. చంద్రబాబు జోక్యంతో మెత్తబడ్డారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయన కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈనెల 27న ఈ స్థానానికి పోలింగ్ కూడా జరుగుతుంది.
గత రెండు, మూడు నెలలుగా.. ఆలపాటి రాజా రెండు జిల్లాలలో అన్ని నియోజకవర్గాలలోను కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజా త్యాగం ఫలించేనా అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే కీలకమైన ఇద్దరు నాయకులు రాజాకు ఏమాత్రం సహకరించడం లేదన్న చర్చ నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. తెనాలి నుంచి గెలిచిన ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్.. తెనాలి పక్కనే ఉన్న పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇద్దరు బలమైన నాయకులు. ఇటు నాదెండ్ల మంత్రిగా ఉన్నారు. రాజకీయంగా ఇద్దరు నేతలకు అలపాటి ఉమ్మడి శత్రువు.
ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఈ ఎన్నికలు చాలా లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆలపాటి గెలిచి మండలికి వెళితే.. నియోజకవర్గం పై ఆయన పెత్తనం పెరుగుతుందన్న భావన మంత్రిగా ఉన్న మనోహర్ లో కనిపిస్తోందట. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నాదెండ్ల తెనాలిలో చక్రం తిప్పుతున్నారు. దీంతో రేపు ఆలపాటి విజయం దక్కించుకుంటే.. తన ప్రభావం తగ్గుతుందని నాదెండ్ల లెక్కలు కడుతున్నారట. ఇక గతంలో రాజాకు, నరేంద్రకు మధ్య ఉన్న విభేదాల కారణంగా నరేంద్ర పూర్తి సైలెంట్ అయిపోయారు. మరీ ముఖ్యంగా సంఘం డైరీ విషయంలో ఆలపాటి, నరేంద్ర మధ్య 15 ఏళ్ల నుంచి రాజకీయంగా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రాజా పోటీ చేస్తున్న.. నరేంద్ర ఈ ఎన్నికలు అస్సలు పట్టించుకోవడం లేదని అంటున్నారు.