
తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో ఐదు .. ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి మూడున నోటిఫికేషన్ .. మార్చి 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెలలో పోలింగ్ జరగనుంది. అయితే ఇవి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కావడంతో దాదాపు అన్ని సీట్లు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. జంగా కృష్ణమూర్తి - దువ్వారపు రామారావు - యనమల రామకృష్ణుడు - పరిచూరు అశోక్ బాబు - తిరుమల నాయుడు పదవీకాలం మార్చి 29 ఈ పదవీకాలం ముగుస్తున్న వారిలో జంగా కృష్ణమూర్తి మినహా మిగతా ఎమ్మెల్సీలు టిడిపికి చెందిన వారే. జంగా కృష్ణమూర్తి సైతం ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. దీంతో ఈ ఐదుగురు ఎమ్మెల్సీలు పదవీకాలం ముగియనుండగా ఎమ్మెల్యేల బలం ఉన్నందున ఈ 5 ఎమ్మెల్సీ సీట్లు కూటమి పార్టీలు అయిన టిడిపి - జనసేన - బిజెపి కి దక్కనున్నాయి.
ఎమ్మెల్సీ స్థానాలకు టిడిపి నుంచి ముగ్గురు .. జనసేన - బీజేపీ నుంచి ఒక్కొక్కరు రేసులో ఉన్నారు. టిడిపి నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ .. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా .. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రేసులో ఉంటే .. జనసేన నుంచి నాగబాబు .. బిజెపి నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా నుంచి వీళ్లే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి జనసేనకు ఫిక్స్ అయింది. మరొకటి బీజేపీకి ఇస్తున్నారు.