
మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్‌రెడ్డికి ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఉండాలంటే గురువారం జరిగే గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి పిలుపు ఇచ్చారు. మంగళవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కూటమి పార్టీల నాయకుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 93 పథకాల అమలుకు ఇచ్చిన నిథులను కూడా వాడకుండా మురగపెట్టేసిందని.. జలజీవన్ మిషన్ పథకం కింద 23 వేలు కోట్లు ఇస్తే అందులో కేవలం 4 వేల కోట్లు ఖర్చు చేసి చేతులు ఎత్తేయడంతో మిగిలినవి మురిగిపోయాయని సారథి విమర్శించారు. జగన్‌కు ప్రజా సమస్యల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని.. అసెంబ్లీ సమావేశాలకు వచ్చి 11 నిమిషాలు ఉండి రాష్ట్రంలో ఉన్న రైతు సమస్యలు.. విద్యార్థుల గ్రూప్ 2 సమస్యలు ప్రస్తావించకుండా ప్రతిపక్ష హోదా కోసం రాద్దాంతం చేసి వెళ్లిపోయాడని సారథి విమర్శించారు.
రాష్ట్ర ప్రజల పట్ల.. రాష్ట్ర అభివృద్ధి పట్ల జగన్‌కు ఉన్న ఆలోచన ఎలాంటిదో అర్థం చేసుకోవాలని... మరోసారి జగన్ లాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాజశేఖరంను గెలిపించాలన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌చంద్రశేషు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేకా ఈశ్వరయ్య తదితరులు మాట్లాడారు. అలాగే నాలుగు మండలాల్లో కూటమి పార్టీలకు చెందిన నాయకులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్స్ ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్ సంఖ్యను 4 వేల నుంచి 11 వేల వరకు తీసుకు వెళ్లడంలో ఎమ్మెల్యే రోషన్ చేసిన కృషిని పలువురు అభినందించారు. సభాధ్యక్షత కామవరపుకోట మండల అధ్యక్షులు కిలారు సత్యనారాయణ నియోజకవర్గంలో ఇళ్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారని.. వారికి నియోజకవర్గ కోటా కంటే కాస్త ఎక్కువుగా గృహాలు మంజూరు చేయాలని సభాముఖంగా కోరగా మంత్రి సారథి అంగీకరించారు.