
జగిత్యాల ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో అందుబాటులో ఉన్న యూరియా బస్తాలు 890... అక్కడ వేచి ఉన్న రైతుల సంఖ్య 80 కూడా దాటదని మంత్రి తుమ్మల అన్నారు. ఆ రోజు ఎంత మంది రైతులు వచ్చినప్పటికీ అందరికీ కూడా యూరియా బస్తాలు పంపిణీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల తెలిపారు. కావాల్సినంత యూరియా అందుబాటులో ఉన్నా... ఆ సోసైటీ తెరిచే సమయం కంటే ముందే అక్కడకు వచ్చిన కొంత మంది రైతుల పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు వరుసలో ఉంచి తమ స్వప్రయోజనం కోసం వీడియో తీశారని మంత్రి తుమ్మల ఆరోపించారు.
ఆ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే దానిని సదరు విపక్ష నాయకులు తమ కుటిల రాజకీయాలకు వాడుకొని రైతులను ఆందోళనకు గురిచేయడం బాధాకరమని మంత్రి తుమ్మల అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకేన్లు జారీ చేశారనడం కూడా పూర్తి అవాస్తవం అని మంత్రి తుమ్మల తేల్చిచెప్పారు. కేవలం రైతుల ఎక్కువ సంఖ్యలో వచ్చిన దృష్ట్యా... పోలీసు సిబ్బంది ఒకరిద్దరు వస్తే వారే టోకెన్లు జారీ చేశారని, రైతాంగాన్ని ఆందోళనకు గురిచేయడం సరికాదని మంత్రి తుమ్మల హితవు పలికారు.
గత ఏడాది యాసంగి కంటే ఈ సీజన్‌లో ఇప్పటికే 1.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా పంపిణీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్రంలో ఇంకా 1.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని మంత్రి తుమ్మల అన్నారు. ఇంకా 40 వేల టన్నుల యూరియా ఈ నెలలోనే పంపిణీ చేస్తున్నామని, అదీ గాకుండా మార్చి నెలలో కూడా లక్షా 80 వేల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరాకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి తుమ్మల తెలిపారు.