అధికార కాంగ్రెస్ పార్టీని వ‌దిలిపెట్టి ప్రతిపక్ష పార్టీలో హ‌స్తం నేత‌లు, కార్యకర్తలు చేరుతున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గులాబీ కండువా కప్పుకొన్నారు. గత 48 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని... రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


ఎస్సెల్బీసీ వద్ద ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారని... రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, గాల్లో చక్కర్లు కొడుతున్నారనికేటీఆర్   ఆరోపించారు. ఇప్పటి వరకు 35 సార్లు దిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి చేసిందేమిటి.. తాజాగా 36వ సారి వెళ్లి చేసేదేమిటని కేటీఆర్  ప్రశ్నించారు. క‌నీసం మంత్రివ‌ర్గ విస్తరణ కూడా చేసుకోలేక‌పోతున్నారని ఎద్దేవా కేటీఆర్  చేశారు.


కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలకు విసుగొచ్చిందని.. రాష్ట్రానికి హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేరని కేటీఆర్  ఆక్షేపించారు. మంత్రుల‌ను నియ‌మించుకోలేని అస‌మ‌ర్థ సీఎం రేవంత్ రెడ్డి... కేసీఆర్‌ను, ఆయ‌న ఆన‌వాళ్లు లేకుండా మాయం చేస్తానని అంటున్నారని కేటీఆర్  మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆరే యాదికి వ‌స్తున్నట్లుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టకీటకీమని ప్రజల ఖాతాల్లో డబ్బులు పడడం లేదు కానీ... రాహుల్ , కాంగ్రెస్ పెద్దల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.


అందుకే రేవంత్ రెడ్డికి మార్కులు పడుతున్నాయని కేటీఆర్  అన్నారు. కడియం శ్రీహరి రాజీనామా చేసి ఉపఎన్నికలు ఎదుర్కోవాలన్న ఆయన... పదిస్థానాల్లో ఉపఎన్నికలు వచ్చి బీఆర్ఎస్ గెలుపు ఖాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంలా నిలుస్తోందని  కేటీఆర్ అన్నారు. ఎస్ఎల్ బీసీ ప్రమాదంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్  ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: