
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్‌ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. వంశీ ఇప్పటికే అరెస్టు అయ్యి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు ఆథారంగా వంశీని 14 రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేయగా.. ఆయనకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని రాయదుర్గం మై హోమ్ భుజాలో వంశీని అరెస్టు చేశారు.
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ ఏ 71గా ఉన్నారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుల్లో బీఎన్ఎస్ సెక్షన్లు 140 ( 1), 308, 351 ( 3), రెడ్‌విత్ 3 ( 5) సెక్షన్ల కింద వంశీని అరెస్టు చేశారు. సత్యవర్థన్ చేసిన ఫిర్యాదు ఆథారంగా వంశీని అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే వంశీ రిమాండ్ మంగళవారంతో ముగియనుంది. ఈ క్రమంలోనే ఈ రోజు దీనిపై విచారణ చేసిన ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీ రిమాండ్‌ను మార్చి 11 వరకు పొడిగించింది. ఈ రోజు జైలు నుంచే వంశీని వర్చువల్‌గా జడ్జి ఎదుట పోలీసులు హాజరు పరిచారు. అనంతరం న్యాయమూర్తి 11 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే ఈ రోజు నుంచి వంశీని పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు. వంశీ ఉన్న జైలు వద్దకు విజయవాడ పడమట పోలీసులు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య వంశీని ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. కస్టడీలోకి తీసుకునే ముందు వంశీకి వైద్య పరీక్షలు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వంశీకి తీసుకు వెళుతోన్న క్రమంలో పోలీసులు డ్రోన్ కెమేరాతో పర్యవేక్షణ చేశారు. సత్యవర్థన్ స్టేట్‌మెంట్ ఆథారంగా వంశీని విచారించనున్నారు.