
పెద్దల సభ సభ్యుల ఎన్నికలకు రాజకీయ పార్టీలు దూరంగా ఉంటాయి. కానీ ఈ మూడు చోట్ల గెలిచేందుకు తెలుగుదేశం సర్వశక్తులు ఒడ్డుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లో జరుగుతోన్న ఎన్నికలు కావడంతో తమ అభ్యర్ధులు ఓటమి చెందితే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలైందన్న సంకేతాలొస్తాయని చంద్రబాబు, పవన్ కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ప్రచారం చేశాయి. మరీ ముఖ్యంగా కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాన్ని కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను మోహరించి మరీ ప్రచారం చేసింది. అయితే ఇక్కడ పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు నుంచి మాజీ మంత్రి, కూటమి నుంచి పోటీ చేస్తోన్న ఆలపాటి రాజా గట్టి పోటీ ఎదుర్కొని ఏటికి ఎదురీదుతున్నారు.
మూడు చోట్ల కూడా పీడీఎఫ్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి కెఎస్ లక్ష్మణరావు, ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గానికి డి వీర రాఘవులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి కె విజయగౌరి పోటీలో ఉన్నారు. వీరు ఉపాధ్యాయ, విద్యా, విద్యార్థుల సమస్యల మీద ఎప్పుడూ పోరాటం చేసే వారు కావడంతో వీరికి కలిసి రానుంది. దీనికి తోడు డీఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడం, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ గందరగోళం, సీపీఎస్ రద్దు ఇవన్నీ లేకపోవడంతో ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఇవన్నీ కూటమి అభ్యర్థులను బాగా టెన్షన్ పెట్టేస్తున్నాయి.