
విజయమ్మ తన అఫిడవిట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు. సరస్వతి పవర్స్ తన కుమారుడు జగన్ తనకు రాసిచ్చిన ఆస్తి అని, దానిపై ఎవరికీ హక్కు లేదని తేల్చి చెప్పారు. "ఇది నా ఇష్టం, ఎవరికి ఇచ్చుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు" అంటూ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, తన కూతురు షర్మిలను ఈ వివాదంలోకి అనవసరంగా లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, జగన్, భారతి మాత్రం సరస్వతి పవర్స్‌లో వాటాల బదిలీని ఆపేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)ని ఆశ్రయించి స్టే కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఎన్‌సీఎల్‌టీ మాత్రం తొలుత స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కానీ, విజయమ్మ, షర్మిలకు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మార్చి 6న విచారణ చేపడతామని తెలిపింది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, షర్మిల మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. తనను కావాలనే ఈ వివాదంలోకి లాగుతున్నారని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపిస్తున్నారు. తన పేరును ఈ కేసు నుంచి తొలగించాలని ఎన్‌సిఎల్‌టిని కోరారు.
మొత్తానికి, వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కలిసి ఉన్న కుటుంబం, ఇప్పుడు ఆస్తుల కోసం కోర్టుకెక్కడం చూస్తుంటే, రాజకీయ వర్గాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ లీగల్ ఫైట్ ఎటువైపు దారితీస్తుందో, మార్చి 6న జరిగే విచారణలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. అప్పటివరకు, ఈ ఫ్యామిలీ డ్రామా మాత్రం హాట్ టాపిక్‌గానే ఉండబోతోంది.