వైసీపీ శ్రేణులు మేలుకోవాల్సిన సమయం వచ్చింది. ఇంకా పాత రోజుల్లోనే ఉండిపోతే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఈవీఎంలు మాయ చేశాయనో, కూటమి కట్టకట్టుకుందో ఓటమికి కారణం అనుకోవద్దు. తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలంగాణలో దెబ్బతిన్నా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పుంజుకుని మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఓటమి శాశ్వతం కాదు, గుణపాఠం కావాలి. పదే పదే తప్పులు చేస్తే ప్రజలు క్షమించరు.

చంద్రబాబు పదేళ్లు అధికారానికి దూరమైనా, మళ్లీ ఐదేళ్లు గ్యాప్ వచ్చినా, తన తప్పులను సరిదిద్దుకుని మరీ గద్దెనెక్కారు. మరి జగన్ మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, పాత పద్ధతుల్లోనే కొట్టుమిట్టాడుతుంటే ఎలా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ మళ్లీ పుంజుకోవాలంటే మూడు మంత్రాలు జపించాల్సిందే అని సూచిస్తున్నారు అవేవో చూద్దాం.

• మొదటి మంత్రం కార్యకర్తలే వెన్నెముక:

వారానికి రెండు రోజులు కాదు, అయిదు రోజులు కార్యకర్తల కోసం కేటాయించాలి. క్షేత్రస్థాయిలో వాళ్లే సైన్యం. వాళ్లని పట్టించుకోకపోతే పార్టీకి పుట్టగతులుండవు. ప్రతి కార్యకర్తతో టచ్‌లో ఉండాలి. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవ్వాలి. అప్పుడే ప్రజల నాడి తెలుస్తుంది. రెండ్రోజులు రెస్ట్ తీసుకుంటే ఎవరూ ఏమీ అనరు. కానీ కార్యకర్తలను విస్మరిస్తే మాత్రం మీ పతనానికి మీరే కారణం అవుతారు.

• రెండో మంత్రం లీగల్ టీమ్‌ను గాడిలో పెట్టాలి

లీగల్ వ్యవహారాలు గాలికి వదిలేయవద్దు. ఒకరిద్దరి మీద ఆధారపడితే మునిగిపోతారు. డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ, గ్రౌండ్ లెవెల్ లాయర్లు చేతులెత్తేస్తున్నారు. కోర్టుల్లో కేసులు ఓడిపోతుంటే జడ్జిలే కుమ్మక్కయ్యారని నిందించడం కాదు, అసలు మీ వాదనలు సరిగ్గా ఉన్నాయా లేదా అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. సమర్థులైన లాయర్లను పెట్టుకోవాలి. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు పోరాడే దమ్మున్న వాళ్లను వెతకాలి. గతంలో బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్న లాయర్లను పంపిస్తే బెయిలు కూడా రాదు. లీగల్ టీమ్‌ను బలోపేతం చేయకపోతే కార్యకర్తలను కాపాడుకోవడం కష్టం.

• మూడో మంత్రం మీడియా యుద్ధం గెలవాల్సిందే:

అమరావతి, మూడు రాజధానులు, సంక్షేమ పథకాల దుబారా అంటూ ప్రతిపక్షాలు చేసిన విష ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వైసీపీ పూర్తిగా విఫలమైంది. జగన్ పాలన విధ్వంసకరమని ముద్ర వేసేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. వీళ్లంతా కలిసి ఒక ఎకోసిస్టమ్ సృష్టించి, నిత్యం వైసీపీని టార్గెట్ చేశారు. రేప్ జరిగినా, మర్డర్ జరిగినా జగన్ వల్లే అంటూ నిందలు వేశారు. వైసీపీ వాళ్లు మాత్రం మీడియాను పట్టించుకోకుండా సైలెంట్‌గా ఉండిపోయారు.

ఇకనైనా మేలుకోవాలి. మీడియా ఎకోసిస్టమ్‌ను మేనేజ్ చేయకపోతే చాలా నష్టం. ప్రతి విమర్శకు ధీటుగా సమాధానం చెప్పాలి. అటాకింగ్ మోడ్‌లోకి మారాలి. లేకపోతే వైసీపీ కథ ముగిసినట్టే. అధికారం వాటంతట అదే వస్తుందని భ్రమలో ఉంటే మాత్రం వైసీపీ వాళ్ల కంటే అమాయకులు మరొకరు ఉండరు. ప్రతిపక్షాలు బలమైన శక్తులని గుర్తించండి. అభిమానం ఉంటే సరిపోదు, అధికారం నిలబెట్టుకోవడానికి పోరాడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: