
తెలంగాణ రాజధాని హైదరాబాద్ .. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ జాతీయ రహదారి ఎన్హెచ్ 65 ఆరు లైన్ల రహదారిగా రూపాంతరం చెందనుంది. ఈ విస్తరణ ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు పడింది. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల రహదారిని ఆరు లైన్లుగా విస్తరించ నున్నారు. ఇందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ( డీపీఆర్ ) తయారీకి కన్సల్టెంట్ ఖరారైంది. ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించే అంశం పై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు కేంద్ర రవాణా రహదారుల శాఖ గతి యేడాది టెండర్లను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే ఈ టెండర్ ను మధ్యప్రదేశ్లోని భోపాల్ కు చెందిన ఓ కంపెనీ దక్కించుకుంది. ఈ సంస్థ తో కేంద్రం ఈ నెలాఖరు లో ఒప్పందం కుదుర్చుకొని ఉంది. రహదారి అధ్యయనం రోడ్డు భద్రత అంశాలు కలిపి డీపీఆర్ తయారు చేసేందుకు 9.86 కోట్లు ఖర్చు చేయనున్నారు.
తెలంగాణలోని దండు మల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మైలవరం నియోజకవర్గం లో ని గొల్లపూడి వరకు అంటే దాదాపు 265 కిలోమీటర్ల మేర ఆరు లైన్లుగా విస్తరించ నున్నారు. ఈ రోడ్డును మంజూరు చేసి నిర్మించే సమయంలో ఆరు లైన్లకు సరిపడా భూమిని సేకరించడంతో మళ్ళీ ఇప్పుడు కొత్తగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. అయితే సాంకేతికంగా కొన్ని అంశాల పరిశీలన .. అధ్యయనం చేయాల్సి ఉంటుంది. గతంలో విజయవాడకు ఎన్హెచ్ 65 మార్గమే ప్రధానంగా ఉంది. ఇప్పుడు సూర్యపేటకు పది కిలోమీటర్ల ముందు ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఖమ్మం నుంచి దేవరపల్లి రాజమండ్రి కి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది.