
బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఇప్పటివరకు కొనసాగిన జేపీ నడ్డా పదవీకాలంతో ముగిసింది. దీంతో చాలా రోజులుగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిపై ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. అనేక సమీకరణలు పరిశీలించిన తర్వాత ఈసారి దక్షిణాదికి అందులో మహిళ నేతకు అవకాశం కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం చూస్తే ఏపీ బీజేపీ అధ్యక్షరాలు దగ్గుబాటి పురందేశ్వరి .. తమిళనాడు నేత వనతి శ్రీనివాసన్ పేర్లు పరిశీలనకు వచ్చినట్లుగా జాతీయ మీడియా వర్గాలు ప్రకటిస్తున్నాయి. వనతి శ్రీనివాసన్ తమిళనాడులో కీలక నేతగా ఉన్నారు . . ఆమె దూకుడుగా వ్యవహరిస్తారు అన్న పేరు ఉంది. కోయంబత్తూర్ సౌత్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల లో ఆమె కమల్ హాసన్ పై సంచలన విజయం సాధించారు. ఆమె చాలాకాలంగా బిజెపిలో ఉన్నారు. తమిళనాడు ను రెండుగా విభజించి కొంగునాడు ఏర్పాటు చేయాలని బలంగా వాదిస్తూ ఉంటారు. పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో పదేళ్లు కేంద్ర మంత్రిగా చేసి ఆ తర్వాత పార్టీ మారారు.
బయట నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వకూడదని అనుకుంటే పురందేశ్వరి పేరును పక్కన పెట్టే అవకాశం ఉంది. బిజెపి రాజకీయాలను రాజకీయం లాగే చేస్తుందన్న సంకేతాలను పంపాలనుకుంటే పురందేశ్వరి ని అధ్యక్షురాలుగా చేసే అవకాశం ఉంది. బిజెపి అధ్యక్షుడుగా ఎవరు ఉన్నా పార్టీ నిర్ణయాలు అన్ని మోడీ - అమిత్ షా మాత్రమే చూసుకుంటారు. అమిత్ షా రెండుసార్లు బిజెపి అధ్యక్షుడిగా చేసిన తర్వాత ఆ పార్టీ నిబంధనలు అంగీకరించవు కాబట్టి ఆయనను పక్కన పెట్టారు. ఆయన తర్వాత వచ్చిన అధ్యక్షులు అమిత్ షా కను సన్నల్లోనే పనిచేస్తూ పార్టీని నడిపిస్తున్నారు. కొత్తగా ఈసారి దక్షిణాది నుంచి అధ్యక్షుడిని ఎన్నిక చేయాలని అనుకోవటమే వారి రాజకీయ వ్యూహం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. డీలిమిటేషన్ తో పాటు ఇతర అంశాలలో దక్షిణాదిలో అసంతృప్తి రాకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.