ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఉపాధ్యాయులను ఎంతగానో ఊరిస్తున్న నోటిఫికేషన్ “డీఎస్సి”.. గత ఐదేళ్లుగా ఉపాధ్యాయ నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.. గతంలో 2018 లో విడుదలైన నోటిఫికేషన్.. అంతే మళ్ళీ దాని ఊసే లేదు.. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఉపాధ్యాయ నిరుద్యోగుల జీవితాలు మాత్రం మారటం లేదు.. అదిగో డీఎస్సి, ఇదిగో డీఎస్సి అంటూ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా కాలయాపన చేసి ఎన్నికల ముందు కంటి తుడుపు చర్యగా 6100 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.. కానీ పరీక్ష జరగకుండానే ఎన్నికల కారణంగా ఆ నోటిఫికేషన్ వాయిదా పడింది..

తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సి పై మొదటి సంతకం పెడతామని ప్రగల్బాలు పలికి భారీ స్థాయిలో గెలిచిన కూటమి ప్రభుత్వం సంతకం అయితే చేసింది గాని నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందో తెలియని పరిస్థితి.. ప్రభుత్వం ఏర్పాటు అయి 9 నెలలు పూర్తి అయింది.. కానీ నోటిఫికేషన్ మాత్రం రాలేదు.. గత ఏడాది నవంబర్ లోనే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావాల్సి వుంది.. కానీ ఎస్సి వర్గీకరణ కారణంగా వాయిదా పడింది.. ఈ వర్గీకరణకు ప్రభుత్వం వన్ మ్యాన్ కమీషన్ వేసింది.. ఆ కమీషన్ నివేదిక సమర్పించాకే నోటిఫికేషన్ విడుదల అవుతుంది.. కానీ గత నెలలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే డీఎస్సి పై వరుస ప్రకటనలు ఇచ్చారు.

 జూన్ లోపు ప్రక్రియ పూర్తి చేస్తాం అని వరుస హామీలు ఇచ్చారు.. తాజాగా ఎన్నికలలో ఒక్క టీచర్ ఎమ్మెల్సీ తప్ప పట్టభద్రుల ఎమ్మెల్సీ లను కూటమి కైవసం చేసుకుంది.తాజాగా ఎన్నికల కోడ్ కూడ ముగిసింది.. ఎట్టి పరిస్థితిలో మార్చి లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న లోకేష్ తన మాట నిలబెట్టుకోవాల్సి వుంది.. లేకపోతే కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగుల నిరసన సెగ తగిలే ప్రమాదం కచ్చితంగా వుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: