
ఇక కొత్తగా ఇపుడు కర్ణాటక ప్రభుత్వం కూడా హిందీ భాషపై వ్యతిరేక గళాన్ని వినిపిస్తోంది. అవును, బెంగళూరులో హిందీలో మాట్లాడకపోతే అదేదో పెద్ద దోషం అయినట్టు ప్రవర్తించే నార్తిండియన్ల తీరు నేపథ్యంలో కన్నడీగులు కస్సుబుస్సు మంటున్నారు. హిందీ డ్యామినేషన్ నానాటికీ తీవ్రరూపం దాల్చుతుండడంతో కన్నడీగుల్లో కూడా మెల్లమెల్లగా వ్యతిరేకత మొదలైంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో గత కొన్నాళ్లుగా నార్తిండియన్లు టార్గెట్ అవుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు వీరిపై తిరగబడుతున్నారు! బెంగళూరు కన్నడ నేల అని వారు గుర్తు చేయడానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. హిందీ వాళ్లు అతి చేయకపోతే ఇలాంటి పరిస్థితి కర్ణాటకలో వచ్చేది కాదు అని విశ్లేషకులు అంటున్నారు.
కర్ణాటకలో బీజేపీ ఉనికి కూడా హిందీకి అక్కడ ఊతం ఇస్తూ ఉందనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కన్నడలోనే మాట్లాడాలని, వేరే భాషలను అర్థం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని సీఎం సిద్ధరామయ్య తాజాగా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెనుదుమారాన్నే లేపింది. ఈ క్రమంలో హిందీ వ్యతిరేకతను రాజకీయంగా కాంగ్రెస్ వాడుకుంటోందని గుసగుసలు వినబడుతున్నాయి. తమిళలకు మల్లె కన్నడీగులు కూడా భాషా ప్రేమికులే. దాంతో ఈ వ్యవహారంలో కర్ణాటకలో ఎలా స్పందించాలో దిక్కుతోచని స్థితిలో ఉంది బీజేపీ. హిందీని జాతీయ భాష అంటూ ఇలా రుద్దుకుంటూ పోతే స్థానికుల్లో వ్యతిరేకత వస్తుందనే విషయం బీజేపీలో గుబులు రేపుతోంది వినికిడి.
అదంతా పక్కనబెడితే... త్రిభాషా రాజకీయం కేవలం సౌత్ వరకేనా.. నార్త్ కి వర్తించదా అని పలువురు రాజకీయ ఉద్ధండులు ప్రశ్నిస్తున్నారు. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ లో హిందీని ప్రథమ భాషగా, ఇంగ్లిష్ ను ద్వితీయ భాషగా, తెలుగునో, తమిళన్నో, మలయాళాన్నో తృతీయ భాషగా లేదా.. ఏ పంజాబీనో అయినా ఒక సబ్జెక్ట్ గా బోధించే సంస్కృతి అక్కడ తేగలరా అని సర్వత్రా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. త్రిభాషా సిద్ధాంతం అంటే ప్రతి రాష్ట్రంలోనూ దాని మాతృభాషతో సహా ఇంగ్లిష్ తో పాటు మరో భారతీయ భాషను బోధించాలి కదా అని అంటున్నారు. కానీ, విచారకరం ఏమిటంటే.. ఈ త్రిభాషా సూత్రం దక్షిణాది రాష్ట్రాల మీదే తరతరాలనుండి రుద్దబడుతోంది.