అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్, చైనా, కెనడా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలపై "పరస్పర సుంకాలు" విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ దేశాలు అమెరికా వస్తువులపై ఎక్కువ పన్నులు వేస్తున్నాయని, కానీ తాము మాత్రం తక్కువ పన్నులు విధిస్తున్నామని ట్రంప్ మండిపడ్డారు. ఇది చాలా అన్యాయం అని, దశాబ్దాలుగా ఇదే తంతు నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 2 నుంచి ఈ కొత్త సుంకాలు అమలులోకి వస్తాయి. ఈ విధానం ప్రకారం, ఇతర దేశాలు అమెరికా వస్తువులపై ఎంత పన్ను విధిస్తాయో, అమెరికా కూడా ఆ దేశాల వస్తువులపై అంతే పన్ను విధిస్తుంది. దీనివల్ల వాణిజ్యం మరింత న్యాయంగా జరుగుతుందని, అమెరికాకు లక్షల కోట్ల డాలర్లు వస్తాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడా వంటి దేశాలు అమెరికా ఉత్పత్తులపై ఎక్కువ పన్నులు విధిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఉదాహరణకు భారత్, అమెరికా కార్ల దిగుమతులపై ఏకంగా 100% పైగా పన్నులు వేస్తోందని ట్రంప్ గుర్తు చేశారు. చైనా అయితే అమెరికా వస్తువులపై విధిస్తున్న పన్నుల కంటే రెట్టింపు పన్నులు విధిస్తోందని, దక్షిణ కొరియా ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువ పన్నులు వేస్తోందని ఆయన విమర్శించారు.

దక్షిణ కొరియా వంటి మిత్ర దేశాలు సైతం అమెరికా సైనిక సహాయం పొందుతూనే, అమెరికా వస్తువులపై మాత్రం అధిక పన్నులు విధిస్తున్నాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ అమెరికాకు "అన్యాయం" చేస్తోందని, ఇది చాలా కాలంగా కొనసాగుతోందని ఆయన దుయ్యబట్టారు.

భారత్‌ను కూడా ఈ కొత్త సుంకాల నుంచి తప్పించేది లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్ వచ్చినప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇతర దేశాలు అమెరికా వ్యాపారాలపై వాణిజ్యపరమైన ఆంక్షలు విధిస్తే, తాము కూడా అలాంటి ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా, ఇతర దేశాలపై విజయవంతంగా సుంకాలు విధించానని ట్రంప్ గుర్తు చేశారు. బైడెన్ ప్రభుత్వం ఆ విధానాలను మార్చలేకపోయిందని ఆయన విమర్శించారు.

అమెరికా వాణిజ్య అంచనాల ప్రకారం, 2024లో భారత్-అమెరికా మధ్య వస్తువుల వాణిజ్యం 129.2 బిలియన్ డాలర్లుగా ఉంది. పరస్పర సుంకాలతో అమెరికా బిలియన్ల డాలర్లు సంపాదిస్తుందని, ఎక్కువ అమెరికన్ ఉద్యోగాలు సృష్టించవచ్చని ట్రంప్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: