
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైన ఫలితాలు సాధించడంతో ఆ పార్టీ కేడర్‌లో జోష్ అయితే మామూలుగా లేదు. ఉత్తర తెలంగాణ లోని రెండు నియోజకవర్గాల్లోనూ కాషాయ జెండా రెప రెపలాడింది. ఓ పట్టభద్రుల నియోజకవర్గం, మరో టీచర్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. మరో టీచర్ నియోజకవర్గాన్ని ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ గెల్చుకుంది. ఇది నల్లగొండ నియోజకవర్గం. ఇక మూడు స్థానాల్లో నూ బీఆర్ఎస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ పోటీ చేసిన ఒక్క చోట కూడా పోరాడి పోరాడి ఓడిపోయింది. ఆ పార్టీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. పైగా కాంగ్రెస్ తన సిట్టింగ్ సీటు ఓడిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ లో ఎవరికి వారే చేసుకునే రాజకీయం కావడంతో కాంగ్రెస్ ఇరుక్కుపోయింది.
ఇక ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని మీడియా ఛానెల్స్ లో కిషన్ రెడ్డి ప్రత్యేక వ్యూహం పాటించి బీజేపీ అభ్యర్థుల గెలుపుల వెనుక కీలక పాత్ర పోషించారని కథనాలు వండేశాయి. కొందరు అయితే కిషన్ రెడ్డి వల్లే బీజేపీ రెండు సీట్ల లో గెలిచిందన్న విషయాన్ని నమ్మేశారు. ఏదేమైనా కిషన్ రెడ్డి కి ఈ గెలుపు మైలేజీ ఇచ్చేందుకు ఆ చానళ్లు ప్రయత్నించాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉండడంతో సహజంగా క్రెడిట్ ఆయనకే రావాలి కానీ .. రెండు ఎమ్మెల్సీలూ కరీంనగర్ కేంద్రంగా ఉన్నవే .. మరి అక్కడే బండి సంజయ్ ముందుకు వస్తుండడం తో క్రెడిట్ ఆయనకు కూడా ఇవ్వాలి. వాస్తవానికి బండి సంజయ్ ఎగ్రెసివ్ పాలిటిక్స్‌తోనే ఎమ్మెల్సీ సీట్లలో బీజేపీ గెలిచిందన్న వాదన కూడా ఉంది.
ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన ఓట్లతోనే బీజేపీ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ గెల్చుకుందని.. ఈ ఎన్నికల్లో అసలు స్టార్ ప్లేయర్ బండి సంజయేనని ఆయన వర్గం వాదిస్తోంది. మరి ఈ క్రెడిట్‌ను హై కమాండ్ ఎవరికి ఇస్తుందన్నది చూడాలి.