
అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో గ్రూపు గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుండగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన నేతలు అంతర్గతంగా వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి .. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎన్నికలకు ముందు రాప్తాడు నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలలో భాగంగా కొందరిపై పార్టీ వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారందరినీ మాధవ్ చేరదీసి గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని తోపుదుర్తి వర్గం ఆరోపిస్తోంది.
ఈ మేరకు తోపుదుర్తి పార్టీ అధినేత జగన్ తో పాటు సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి పలు విషయాలను తీసుకెళ్లినట్టు సమాచారం. మాధవ్ ఎంపీగా ఉన్న సమయంలో వీడియో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తర్వాత క్రమశిక్షణ చర్యలలో భాగంగా సస్పెండ్ చేయడానికి నిర్ణయం తీసుకోగా తోపుదుర్తి సోదరులే ఆయనను రక్షించారని .. సజ్జల వైసిపి నేతలతో ప్రస్తావించినట్టు తెలియ వచ్చింది. ఆరోజు మాధవ్ కు అండగా ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఉండటాన్ని తోపుదుర్తి వర్గం సహించలేకపోతోంది.
పైగా వచ్చే ఎన్నికలలో తాను ఎట్టి పరిస్థితులలోనూ రాప్తాడు నుంచి పోటీ చేస్తానని మాధవ్ గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో మాధవ్ ను ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కాకుండా కర్నూలు జిల్లాలోని పత్తికొండ నుంచి పోటీ చేయించే అంశంపై వైసీపీలోనే సమాలోచనలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ గ్రూపు రాజకీయాలు అనంతపురం జిల్లాలో వైసీపీకి తలనొప్పిగా మారాయి. మరి వీటిని జగన్ ఎలా సరి చేస్తారో ? ఏం జరుగుతుందో ? చూడాలి.