
చంద్రబాబు నేతృత్వంలోని సర్కారులో మొత్తంగా ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. కీలక శాఖల కు అమాత్యులుగా ఉన్న ఈ వనితా మణుల పనితీరు చంద్రబాబును సైతం మెప్పిస్తోంది. వీరిలో మరీ ముఖ్యంగా వంగలపూడి అనిత.. హోం శాఖ మంత్రిగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారనే చెప్పాలి. అనేక సవాళ్లను.. సమస్యలను అధిగమిస్తున్నతీరు.. ఒత్తిడిని తట్టుకుంటున్న తీరు.. వంటివి ఆమె పరిణితికి నిదర్శనమనే భావిస్తున్నారు.
వాస్తవానికి ఎక్కడా లేని సమస్యలు హొంకే ఉంటున్నాయి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే అందరి వేళ్లూ.. హోం వైపే ఉంటాయి. అలాంటి శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. సోషల్ మీడియా దుష్ప్రచారం వంటివాటిని గట్టిగా నియంత్రించిన ఘనత అనితకే దక్కుతుంది. ఇక, చేనేత, జౌళి శాఖ మంత్రి సంజీవ రెడ్డిగారి సవిత.. నేతన్నల కు మరో ప్రపంచాన్ని సృష్టించాలన్న తపనతో ఉన్నారన్నది వాస్తవం. ఎక్కడ అవకాశం వచ్చినా.. నేతన్నలకు మెరుగైన లాభాలు వచ్చేలా మార్కెటింగ్ రంగాన్ని ఆమె ప్రోత్సహిస్తున్నారు.
అలుపెరుగని నాయకురాలిగా .. నిరంతరం పర్యటనలు పెట్టుకుని.. చేనేత వస్త్రాలకు డిమాండ్ తీసుకు రావడంతోపాటు.. బీసీల అభివృద్ధికి కూడా మంత్రి సవిత నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మిడి సంధ్యారాణి రికార్డు సృష్టిస్తున్నారనే చెప్పాలి. ఒకప్పుడు గిరిజన గూడేలకు సౌకర్యాలు అంతంత మాత్రమే. అలాంటిది.. ఇప్పుడు సాధ్యమైనన్ని గిరిజన గూడేలకు రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. వారి అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కోసం తపిస్తున్నారు. ఎక్కువ సేపు నియోజకవర్గంలో ఉంటున్న నాయకురాలిగా కూడా పేరు తెచ్చుకున్నారు.
అందరూ ఫైరే!
రాజకీయంగా చూసుకున్నా.. ఈ ముగ్గురు మంత్రుల పనితీరు భేష్ అనే చెప్పాలి. ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలను దీటుగా ఎదుర్కోవడంలోనూ.. సమస్యల పరిష్కారంలోనూ పురుష మంత్రులతో సమానంగా వీరి పనితీరు ఉండడం మెచ్చుకోదగిన అంశం. అటు శాంతి భద్రతలైనా.. ఇటు.. అభివృద్ది, సంక్షేమం అయినా.. వీరు కూటమి సర్కారుకు మకుటాయమానంగా నిలుస్తున్నారు. నిరంతరం ప్రజలతో కలివిడిగా ఉండడమే కాకుండా.. మీడియా ముందుకు సైతం వస్తూ.. తమ సత్తా చాటుతున్న ఈ మంత్రులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన వేనవేల శుభాకాంక్షలు!!