
గౌతు శిరీష: కూటమి సర్కారులో మహిళల గురించి ప్రస్తావించాల్సి వస్తే.. తొలిపేరు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గురించే చెప్పాలి. తాత, తండ్రి వారసత్వంగా రాజకీయాలు అందిపుచ్చుకున్నా.. శిరీష రాజ కీయ జీవితం.. వడ్డించిన విస్తరి అయితే కాదు. అలుపెరుగని పోరాటాలు.. కేసులు.. కోర్టులు .. అంటూ.. సుదీర్ఘకాలం ఆమె ప్రజాజీవితంలో అలుపెరుగని యుద్ధమే చేశారు. వైసీపీ హయాంలో లెక్కలేనని కేసులు.. అవమానాలు ఎదుర్కొన్న మహిళామణుల్లో శిరీషను మించిన నాయకురాలు లేరు.
అయినా.. ఓర్పు-నేర్పు.. ప్రజలతో నెలకొన్న బంధం వంటివాటిని మరింత మెరుగు పరుచుకుని ముందు కు సాగిన గౌతు శిరీష.. కూటమి సర్కారు ఏర్పాటులో తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషించారు. బలమైన నాయకుడిని, సామాజిక వర్గ విభేదాలను కూడా ఎదుర్కొని తనను తాను నిరూపించుకున్నారు. ఇక, కడప ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డప్పగారి మాధవీ రెడ్డి పనితీరు కూడా.. గొప్పదే. బలమైన వైసీపీ కంచుకోట గా ఉన్న కడపలో ఆమె పాగా వేయడం అంటే మాటలు కాదు.
అప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గం వైపు, ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి మాత్రమే పరిమితమైన ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోగల నేర్పుతో ఆమె ప్రదర్శించిన పనితీరు.. నభూతో అనే చెప్పాలి. అదేవిధం గా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తొలితరం నాయకురాలిగా అడుగులు వేసి.. ఘన విజయం దక్కించుకున్నారు. ఎమ్మెల్యే అన్న భేషజం లేకుండా.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడకు వెళ్లి పరిష్కరించే నాయకురాలిగా కూడా.. మాధవి పేరు తెచ్చుకున్నారు. కూటమి సర్కారులో ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఉండడం గమనార్హం.
బాబు దిశానిర్దేశంలో..
టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశంలో మహిళా నాయకులు, ఎమ్మెల్యేలు సివంగుల మాదిరిగా పనిచే స్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. నియోజకవర్గాల సమస్యలే కాదు.. విపక్ష విమర్శలపై కూడా తమదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తూ.. తమకే కాకుండా.. చంద్రబాబుకు కూడా పేరు తీసుకురావడం లో ఈ మహిళా ఎమ్మెల్యేల పనితీరు భేష్ అనే మాట వినిపిస్తోందనే చెప్పాలి.