
"అమెరికా చెప్పినట్టు వింటూ, వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే మన భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది. ఉక్రెయిన్ విషయంలో అమెరికా వ్యవహరించిన తీరు మన కళ్లముందు ఉంది. నాటోలో సభ్యత్వం ఇస్తామని, యూరోపియన్ యూనియన్‌లో స్థానం కల్పిస్తామని ఊరించి, ఆ తర్వాత నడిరోడ్డుపై వదిలేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడుని మార్చే కుట్రలు చేశారు. ఇది మనకు గుణపాఠం కావాలి," అంటూ పోలాండ్ ప్రధాని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
యూరోప్ దేశాలు ఇకనైనా మేల్కొని సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నాటో సైన్యం, యూరోపియన్ సైన్యం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, లేకపోతే రష్యా వంటి దేశాల నుంచి ముప్పు తప్పదని ఆయన స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ సంక్షోభం ముగిసిన తర్వాత పోలాండ్‌కు ముప్పు పొంచి ఉందని, రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే యూరోప్ ఐక్యంగా ఉండాలని పోలాండ్ ప్రధాని అభిప్రాయపడ్డారు. అమెరికాపై ఆధారపడటం మానేసి, యూరోప్ దేశాలన్నీ కలిసి ఒకే తాటిపై నడవాలని ఆయన సూచించారు.
అమెరికా "పెద్దన్న" ధోరణి ఇటీవల ఎక్కువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత నుంచే ఈ పరిస్థితి మరింత తీవ్రతరమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎలాన్ మస్క్ వంటి వారి ప్రభావంతో ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. దీని ఫలితంగా అమెరికా మిత్రదేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయని, వివిధ దేశాలపై ఆంక్షలు పెరుగుతున్నాయని, భారతదేశం వంటి దేశాలు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పలువురు అంచనా వేస్తున్నారు. మరి చివరికి అమెరికా పరిస్థితి ఏమవుతుందో, ఏం జరుగుతుందో చూడాలి.