
నిజానికి ఎమ్మెల్సీ స్థానాల పంపకంపై తొలుత టీడీపీ, జనసేన మధ్యనే చర్చలు జరిగాయి. నాలుగు స్థానాలు టీడీపీకి, ఒకటి జనసేనకు అంటూ లెక్కలు తేలాయి. బీజేపీ ఊసే లేదు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. చివరి నిమిషంలో కమలం పార్టీ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. ఐదు స్థానాల్లో మూడు టీడీపీకి, ఒకటి జనసేనకు, ఇంకొకటి బీజేపీకి కేటాయించడంతో అందరూ షాక్ తిన్నారు.
మొన్నటివరకు జనసేనకు మంత్రి పదవితోపాటు ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా టీడీపీ వాటాలో కోత పెట్టి మరీ తన ఖాతాలో వేసుకుంది. ఇంతకీ ఈ అనూహ్య మార్పు వెనుక అసలు మతలబు ఏంటి? టీడీపీ వ్యూహం బెడిసి కొట్టిందా? లేక బీజేపీ వ్యూహాత్మకంగానే టీడీపీకి షాక్ ఇచ్చిందా? ఏది ఏమైనా, ఈ ఎమ్మెల్సీ సీటు బీజేపీకి ఊహించని బహుమతే అని చెప్పొచ్చు. ఇప్పుడు బీజేపీ ఎవరికి ఎమ్మెల్సీ సీటు ఇస్తుందో చూడాలి.
ఇకపోతే బాబు సర్కార్ హయాంలో బీజేపీ అనూహ్యంగా ఎమ్మెల్సీ సీటు కొట్టేసింది. టీడీపీ, జనసేన సీట్ల పంపకాల్లో కమలనాథులు ఎంట్రీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. టీడీపీ వ్యూహాలకు చెక్ పెట్టి బీజేపీ పై చేయి సాధించిందా, ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.