
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రి అయి తొమ్మిది నెలలు అవుతుంది. ఈ తొమ్మిది నెలలలో తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు కార్యకర్తల ఆశలు ఆవిరి అయిపోతున్నాయి. సోషల్ మీడియాలో వారి బాధ అంతా ఇంతా కాదు.. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీని పొగుడుతూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ పోస్టులు పెట్టేవారు కూడా ఇప్పుడు చంద్రబాబు తీరుపట్ల తమ ఆవేదన .. ఆక్రోషం .. బాధ .. అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా జీవి రెడ్డి విషయంలో చంద్రబాబు - లోకేష్ వ్యవహరించిన తీరు తెలుగుదేశం పార్టీ సగటు కార్యకర్తలు వీరాభిమానులకు ఎంత మాత్రం నచ్చలేదు. జీవీ రెడ్డి లాంటి నాయకుడి విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన అలాంటి నేత విషయంలో చంద్రబాబు .. లోకేష్ వ్యవహరించిన తీరు ఎవరికీ ఎంత మాత్రం నచ్చలేదు. ఇది ఇలా ఉంటే సోము వీర్రాజు ప్రతిసారి చంద్రబాబు దయతో పదవులు తీసుకుని జగన్ పాట పాడుతూ జగన్కు సపోర్టుగా ఉంటారు అన్నది తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆరోపణ.
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు ఓడిపోయినప్పుడు జగన్‌కు సపోర్టుగా చంద్రబాబు తీరుపై వీర్రాజు తీవ్రమైన విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో సోమ వీర్రాజు ఏనాడు జగన్ పై విమర్శలు చేయలేదు .. సరి కదా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మళ్ళీ సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వటాన్ని తెలుగుదేశం పార్టీ వీర అభిమానులు ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు గారు ఇలాంటి పనుల వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ... దయచేసి ఇక మీరు రాజకీయాలకు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులు పోస్టులు పెడుతూ తమ బాధను వెళ్ళగకుతున్నారు.