
ఒకప్పుడు పెళ్లిళ్లంటే సందడి.. సంబరాలు.. ఆ రోజుల్లో డ్రమ్ముల్లో నీళ్లు, గ్లాసులు కనిపించేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. స్టేటస్ కోసం మినరల్ వాటర్ బాటిల్స్ వచ్చాయి.. ఆ తర్వాత ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ రాజ్యమేలిపోయాయి. ఖర్చు తక్కువ, శ్రమ లేదని ప్లాస్టిక్ బాటిళ్లకు జై కొట్టారు. కానీ ఈ ప్లాస్టిక్ భూమాతకు శాపంగా మారింది. పర్యావరణాన్ని నాశనం చేస్తోంది.
దీంతో కేరళ హైకోర్టు రంగంలోకి దిగింది. ప్లాస్టిక్ కాలుష్యంపై తీవ్రంగా స్పందించింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి ప్రమాదకరమని, వీటిని కట్టడి చేయకపోతే భవిష్యత్తు తరాలకు తీరని నష్టం వాటిల్లుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ప్లాస్టిక్ వాడొద్దని తేల్చి చెప్పింది. పునర్వినియోగ ప్లాస్టిక్‌ను ప్రోత్సహించాలని సూచించింది.
ఇది మాత్రమే కాదు.. కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకంపై కూడా దృష్టి సారించింది. 100 మందికి మించి పాల్గొనే ఫంక్షన్లలో ప్లాస్టిక్ వస్తువులు వాడాలంటే ఇకపై అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. స్థానిక యంత్రాంగం ఈ అనుమతులు జారీ చేస్తుందని కోర్టు తెలిపింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2016ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కొందరు దీన్ని క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పర్మిషన్ల పేరుతో కొత్త దందా మొదలవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నీళ్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ, పర్మిషన్ కోసం జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తుందేమో అని జనం భయపడుతున్నారు.
మొత్తానికి కేరళ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్లాస్టిక్ రహిత సమాజం వైపు ఒక ముందడుగు వేస్తుందా.. లేక కొత్త లంచాల దందాకు తెర తీస్తుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, పెళ్లిళ్లలో ప్లాస్టిక్ బాటిళ్ల హవాకు మాత్రం బ్రేక్ పడినట్టే.