
ఇంతకీ ఎందుకీ వెసులుబాటు? గతంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బిల్లుల్లో భారీ అవకతవకలు జరిగాయన్న అనుమానాలే దీనికి కారణమా? నిజానికి గతంలో బిల్లులు రాబట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. జనం సొమ్ముతో బస్సులేసి మరీ ఢిల్లీ యాత్రలు చేయించి, ఆ ఖర్చులను కూడా ప్రాజెక్టు బిల్లుల్లో కలిపేశారన్న విమర్శలు ఉన్నాయి. పట్టిసీమ బిల్లులను సైతం పోలవరం ఖాతాలో వేసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో బిల్లులు ఆపితే చాలు.. వెంటనే కేంద్రం మోసం చేసిందని, మోదీ పోలవరం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని 2018లో గోల చేయడం మొదలుపెట్టారు.
ఈసారి ఆ డ్రామాలు వర్కౌట్ కాకుండా కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టుంది. పూర్తి బాధ్యత తమదే అన్నట్టుగా వ్యవహరిస్తూ, తాజాగా మరో 2705 కోట్లు అడ్వాన్స్ ఇచ్చింది. ఇదివరకు రెండున్నర వేల కోట్లు అంటే మొత్తంగా 5200 కోట్లకు పైగా నిధులను అడ్వాన్స్‌గా ఇచ్చి పనులు వేగవంతం చేయాలని ఆదేశించింది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌లో పోలవరం కోసం ఏకంగా రూ.6000 కోట్లు పైనే కేటాయించడం విడ్డూరంగా ఉంది. కేంద్రం నేరుగా నిధులిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఎందుకు బడ్జెట్‌లో నిధులు పెట్టాలి, ఇది లెక్కల్లో మాయనా, కేంద్రం ఇచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటున్నారా లేక ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్నారా, ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా పోలవరం విషయంలో మాత్రం కేంద్రం దూకుడు మీదుందని చెప్పొచ్చు.