
కూటమి ప్రభుత్వంలో మంగళగిరిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణం వీజే కాలేజీ వద్ద బైపాస్ సర్వీస్ రోడ్డులో టీటీడీ బోర్డు పాలకమండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ సన్ ఫ్లవర్ హ్యాండ్ లూమ్స్ షోరూమ్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా షోరూమ్ వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్ కు కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సన్ ఫ్లర్ హ్యాండ్ లూమ్స్ ను రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి చేనేత చీరను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ, చెరువు, కొండ పోరంబోకు, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న వారికి పట్టాల పంపిణీ కసరత్తు ప్రారంభమైంది. మంగళగిరి ప్రజల దశాబ్దాల కల వంద పడకల ఆసుపత్రి. కార్పోరేట్ హాస్పిటల్ కు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తాం. ఇప్పటికే డిజైన్లు ఖరారయ్యాయి.
త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డీపీఆర్ సిద్ధమైంది. మే నెల నుంచి పనులు ప్రారంభిస్తాం. ఏడాదిన్నరలో పూర్తిచేస్తాం. వాటర్ పైప్ లైన్, అండర్ గ్రౌండ్ గ్యాస్, పవర్ తో పాటు పార్కులు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తాం. ఇప్పటికే ఎస్ఎల్ఎన్ పార్కు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మంగళగిరిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాజధాని అమరావతి నుంచి రోడ్ నెం.13,15ను మంగళగిరికి అనుసంధానించి ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ప్రముఖ దేవాలయాల తరహాలో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానికిదేవి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.