
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎందుకు స్థాపించారో చెబుతూ, ప్రజల సమస్యలపై పోరాడాలనే బలమైన నమ్మకం, లోతైన భావోద్వేగాలే కారణమన్నారు. తన తండ్రి పోలీస్ ఆఫీసర్ (SI) అవ్వాలని కోరుకున్నారని, కానీ తాను చదువు పూర్తి చేయలేకపోయానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడమే తన నిజమైన సంతృప్తినిస్తుంది అని భావించి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
పవన్ కళ్యాణ్ తన చిన్ననాటి సరదా సంఘటనను గుర్తు చేస్తూ సభికులను నవ్వించారు. ఒకసారి తండ్రికి చెప్పకుండా సెకండ్ షో సినిమాకి వెళ్ళానని, ఆ విషయం తెలిసి నాన్న బాగా తిట్టారని చెప్పారు. తాను స్టార్ హీరో అయ్యాక కూడా తన తండ్రి తనతో చాలా కఠినంగానే ఉండేవారని అన్నారు. తన అన్నయ్యలతో కూడా ఆయన మరింత కఠినంగా ఉండేవారని, క్రమశిక్షణతో పెంచారని పవన్ తెలిపారు.
జనసేన సాధించిన విజయాల గురించి పవన్ గర్వంగా మాట్లాడారు. పార్టీ 11 ఏళ్లుగా ప్రజల్లో ఉందని, రీసెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని (వైసీపీ) కేవలం 11 సీట్లకే పరిమితం చేయడంలో జనసేన కీలక పాత్ర పోషించిందని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు తన రాజకీయ ఆలోచనలకు దిశానిర్దేశం చేశారని చెప్పారు. అలాగే, లెజెండరీ జానపద గాయకుడు గద్దర్ తనను రాజకీయాల్లోకి రావడానికి, ప్రజాసేవకు కట్టుబడి ఉండటానికి స్ఫూర్తినిచ్చారని గుర్తు చేసుకున్నారు. శ్రీపతి రాముడు గారిని వేదికపై సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు.
శారీరకంగా తాను బలహీనంగా మారాను అని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. 'తమ్ముడు' సినిమా రోజుల్లో తాను ఎన్నో కష్టమైన స్టంట్స్ చేసేవాడినని, కానీ ఇప్పుడు ఆరేళ్ల కొడుకుని ఎత్తడానికి కూడా కష్టపడుతున్నానని అన్నారు. అయినా, జనసేన కార్యకర్తల ప్రేమ, ప్రజల ఆశీర్వాదం తనకి మరింత బలాన్ని ఇస్తాయని, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. పవన్ ప్రసంగం ముగిసే వరకు అభిమానులు, కార్యకర్తలు ఆయన పేరును గట్టిగా నినాదిస్తూ మద్దతు తెలిపారు.