
- ముఖ్యమంత్రి ప్రకటన చేసే వరకు ప్రాణం పోయినా కదలను
- రామచంద్ర యాదవ్ పోరాటంలో పలువురు స్వామిజీలు, భక్తులు
- శ్రీనివాసానంద సరస్వతీ స్వామిజీ మద్దతు
- వెంకన్నకు విన్నవిద్దాంకు అద్భుతమైన స్పందన
- బీసీవై జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్
తిరుమల: తిరుమలలో జరుగుతున్న అపచారాలు, అవినీతిపై ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేస్తున్న బీసీవై జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తాజాగా తిరుమల పవిత్రత, పరిరక్షణే ధ్యేయంగా స్వామిజీలు, భక్తులతో కలిసి సోమవారం వెంకన్నకు విన్నవిద్దాం పేరుతో చేపట్టిన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల చేరుకుని అక్కడ వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వామిజీలు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలిపిరిలో శ్రీవారి పాదాల చెంత ఉన్న స్వామి భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవవద్దని.. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని స్వాములు, భక్తులతో కలిసి రామచంద్ర యాదవ్ అలిపిరి వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తిరుమలలో ముంతాజ్ హోటల్‌కు భూమి కేటాయించిన జీవో నెంబర్ 24ను రద్దు చేయాలని.. ఆ స్థలాన్ని భక్తుల కోసం ఉపయోగించాలని ఆయన డిమాండ్ చేశారు.
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటన చేసే వరకు ఇక్కడ నుంచి ప్రాణంపోయినా కదిలే పరిస్థితి లేదు.. వెనకడుగు వేసే ప్రశక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అలిపిరి భూములను హోటల్స్, స్టార్ హోటల్స్, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవద్దని.. స్వామివారి పాదాల చెంత ఉన్న అలిపిరి భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ధార్మికానికి విరుద్ధమైన ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని రామచంద్ర యాదవ్ తెలిపారు.
అలాగే ఆయన ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు కూడా ఉంచారు. తిరుమలలో గోశాల ఏర్పాటు చేసి... సొంతంగా డెయిరీ నిర్వహించి ఆ నెయ్యిని మాత్రమే స్వామి వారి ప్రసాదాలలో వినియోగించాలని.. టీటీడీ పాలకమండలిలో రాజకీయ, కార్పొరేట్ శక్తులకు చోటు కల్పించకుండా... వీఐపీ దర్శనం రద్దు చేసి సామాన్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరికి ఒకే దర్శనం కల్పించాలని కోరారు. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను తొలగించి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడంతో పాటు తొలగించిన వేయికాళ్ల మండపాన్ని మరో చోట వెంటనే నిర్మించాలన్నారు. అలాగే తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి, కపిలతీర్థ, తిరుచానూరు, అలివేలు మంగాపురం ఆలయాలకు కనీసం 2 కిలోమీటర్ల దూరంలో మాంసం, మద్యం దుకాణాలు నిషేధించాలని... తిరుమల ఆదాయ, వ్యవయాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహించి నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న డిమాండ్లు ఆయన ప్రభుత్వం ముందు ఉంచారు.
శ్రీనివాసానంద సరస్వతీ స్వామిజీ మద్దతు :
రామచంద్ర యాదవ్ తిరుమల పవిత్రత కోసం ఎన్నో పోరాటాలు.. ఉద్యమాలు చేస్తున్నారని... తాజాగా
ఎంతో పవిత్రమైన ఆలోచనతో చేసిన ఈ తిరుమల పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్
అధ్యక్షులు, శ్రీ ఆనంద ఆశ్రమం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ సైతం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. వేంకటేశ్వరస్వామికి వినతిపత్రం ఇవ్వడంతో పాటు ఏడుకొండలును మీరే కాపాడాలని ఆయన కోరారు. తిరుమల పవిత్రతకు పోరాటం చేస్తోన్న రామచంద్ర యాదవ్‌కు అన్ని విషయాల్లోనూ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సరస్వతీ స్వామిజీ తెలిపారు.