
- స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా స్థాయి అధికారి నియామకం
- పైలట్ ప్రాజెక్టుగా 4 నియోజకవర్గాలకు విజన్ సిద్ధం
- శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్
స్వర్ణాంధ్ర విజన్ - 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వాటిని అమలు చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలు సంకల్పం తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ముందు కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్టు చెప్పారు. సోమవారం జరిగిన శాసనసభ సమావేశంలో జరిగిన లఘ చర్చలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాల-2047 విజన్ డాక్యమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించి, ప్రజెంటేషన్ ఇచ్చారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్‌ను సఫలీకృతం చేసుకునేందుకు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తున్నామని, దీనికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మండల, మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్‌ను గ్రామ, వార్డు సచివాలయం యూనిట్‌గా తీసుకుని అమలయ్యేలా చూస్తామన్నారు. జిల్లా విజన్ డాక్యుమెంట్ రూపొందించి కలెక్టర్ల సదుస్సులో విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రతి చివరి వ్యక్తిని కూడా విజన్‌లో భాగస్వామిని చేస్తామని చెప్పారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ప్రస్తుతం నెలకొన్న సమస్యలు ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలాగా పరిశ్రమలు తరిమేయడం కాకుండా... తీసుకురావడం నేర్చుకోవాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమలు తేవడంలో మీరు కూడా భాగములు అవ్వాలని సూచించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఉండాలి...అలానే ఉపాధి కలగాలంటే పరిశ్రమలు రావాలి... సేవల రంగం వృద్ధితో ఆదాయం పెరుగుతుందని చెప్పారు. రాయలసీమ రాళ్ల సీమ, ఎడారిగా మారుతుందని గతంలో అందరూ అనుకున్నారు. కానీ రతనాల సీమగా మారుతోంది. సీమ హార్టికల్చర్ హబ్‌గా మారుతోంది. రాయలసీమ సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీకి కేంద్రంగా మారుతుంది. ఒకప్పుడు అనంతపురం కరవు జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాలు సవాల్‌గా ఉండేవి. కృష్ణానది పక్కనున్న మహబూబ్ నగర్‌కు నీళ్లుండేవి కాదు. ఆ రెండు జిల్లాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవాన్ని. విజయవాడ, శ్రీకాకుళం, ఆదిలాబాద్ జిల్లాలకు నీళ్లున్నా అభివృద్ధిలేదు. కానీ ఇప్పుడు అనంతపురం జిల్లా 26 జిల్లాల్లో 5వ స్థానంలో ఉంది. మొదటి స్థానానికి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు.
నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. గత ప్రభుత్వం సెంటు పట్టాను ఊరికి దూరంగా ఇచ్చింది. దాంతో అవి ఎవరికీ పనికిరాకుండా, చాలీచాలనట్టుగా ఉండటంతో నిరుపయోగం అయ్యాయి. సెంటు పట్టా ఉన్నచోటనే స్థలం కావాలంటే రెండు సెంట్లు స్థలం ఇస్తాం. 2029 నాటికి ప్రతి కుటుంబానికి సొంతిల్లు నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు.