
వైసీపీ మాజీ సీనియర్ నాయకుడు వి. విజయసాయిరెడ్డి టార్గెట్ ఎవరు? ఎందుకు ఆయనను టార్గెట్ చేశారు ? అసలు విజయసాయి కేంద్రంగా గత కొద్ది రోజులుగా ఏం జరుగుతుంది ? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ లో ఈ విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులు అందరి టార్గెట్ ఒకే ఒక్క నాయకుడు.. ఆ మాటకు వస్తే వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులకు మాత్రమే కాదు.. ఆ పార్టీ లో ప్రస్తుతం ఉన్న నాయకులకు కూడా ఆయనే టార్గెట్ ? ఆ నేత ఎవరో కాదు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి.
ఆళ్ల నాని నుంచి అవంతి శ్రీనివాసరావు .. అలాగే విజయ సాయిరెడ్డి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి .. మోపిదేవి వెంకట రమణ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు ... పార్టీలో ఉన్న వారు ఇలా అందరి వేళ్లు ఇప్పుడు సజ్జల వైపే చూపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు రగిలిపోతున్న ఏకైక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ అధికారం లో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు ఎవ్వరికి రుచించడం లేదు. అప్పుడు పార్టీ అధికారంలో ఉండడంతో ఎవ్వరూ నోరు మెదిపే సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండడం తో పాటు పార్టీ నుంచి పెద్ద పెద్ద నాయకులు కూడా బయటకు వెళ్లి పోతూ ఉండడంతో ఇప్పుడు సజ్జల ను తిట్టే .. విమర్శించే విషయంలో ఎవ్వరూ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు.
పార్టీకి ప్రత్యక్ష అధ్యక్షుడు, అధినేత జగన్ అయితే.. షాడో అధ్యక్షుడిగా సజ్జల చక్రం తిప్పడంతో పాటు ఇష్టం వచ్చినట్టు చేయడంతో పార్టీ సర్వనాశనం అయిపోయిందన్నదే వారి బాధ. పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయ సాయిరెడ్డి తాజాగా చేసిన కోటరీ వ్యాఖ్యలు సజ్జలను ఉద్దేశించినవేనని అని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.