తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడేందుకు... రాష్ట్రంలో వెన‌క‌బ‌డిన వ‌ర్గాలకు జ‌రుగుతున్న అన్యాయంపై పోరాటం చేసే విష‌యంలో ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా.. ఎన్ని అక్ర‌మ కేసులు పెట్టుకున్నా వెన‌క‌డుగు వేసే ప్ర‌శ‌క్తే లేద‌ని బీసీవై పార్టీ అధినేత బోడే రామ‌చంద్ర యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. తిరుమలలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అప‌చారాలు, వ్యాపారాలపై గ‌ళ‌మెత్తుతూ రామ‌చంద్ర యాద‌వ్ అలిపిరి నుంచి తిరుమ‌ల వ‌ర‌కు వెంక‌న్న‌కు విన్న‌విద్దాం పాద‌యాత్ర‌కు పిలుపు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ పాద‌యాత్ర‌ను పోలీసులు అడ్డుకుని రామ‌చంద్ర యాద‌వ్‌తో పాటు మ‌రో 19 మంది భ‌క్తులు, స్వామిజీల‌పై ర‌క‌ర‌కాల సెక్ష‌న్ల‌తో పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డంపై ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే రామ‌చంద్ర‌యాద‌వ్ కూట‌మి ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తూ ఓ వీడియో సందేశం విడుద‌ల చేశారు.


తిరుమ‌ల అంటే వ్యాపారం... రాజ‌కీయ‌మేనా.. ?
తిరుమ‌ల‌ను అప‌చారాలు, రాజ‌కీయాల నుంచి విముక్తి క‌లిగించేందుకు ఇప్ప‌టికే అనేక మంది ఉద్య‌మాలు, పోరాటాలు, నిర‌స‌న‌లు చేసినా.. దీక్ష‌లు, నిరాహార దీక్ష‌లు చేప‌ట్టినా టిటిడి పాలక మండలికి, ప్రభుత్వానికి ఎన్ని విన‌తులు సమర్పించిన వారిలో ఏమాత్రం చలనం లేద‌న్నారు. తిరుమల అంటే కేవలం వ్యాపార, రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారని... దీనిపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే తాను అలిపిరి నుంచి తిరుమల వరకు పాదయాత్ర శ్రీకారం చుట్టాన‌న్నారు. స్వామికి వినతిపత్రం సమర్పించాలన్న నా పిలుపునకు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు, స్వామీజీలు, సాధువులు స్వచ్ఛందంగా తరలివచ్చార‌ని.. పాదయాత్ర మొదలు పెడుతుండగానే తిరుపతి జిల్లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ  మనోహర్ గారు అల్పాహారం స్వీకరిస్తున్న స్వామీజీలు, సాధువులు, స్వామివారి భక్తులను తీవ్ర‌ భయభ్రాంతులకు గురి చేశార‌ని రామ‌చంద్ర యాద‌వ్ ఆరోపించారు.


హిందూ ధ‌ర్మంకోసం పోరాడితే దొంగ భ‌క్తులుగా ముద్ర వేస్తారా ?
తాము హిందూ ధ‌ర్మం కోసం పాద‌యాత్ర చేస్తుంటే మ‌నోహ‌ర్‌గారు అవమానకరంగా మాట్లాడుతూ మీరందరూ దొంగ స్వామిజీలు... దొంగ భక్తులు అంటూ  రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అందరూ సంయ‌మ‌నంతో... శాంతియుతంగా ఉన్నామ‌న్నారు.  గోవింద నామాలతో మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటే అక్కడ కూడా పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటూ ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమాన్ని విధ్వంసంగా మార్చేందుకు కుట్ర చేశార‌ని రామ‌చంద్ర యాద‌వ్ ఆరోపించారు. పోలీసులు  భక్తులు, స్వామీజీల పైన దాడి చేయడంతో చాలామందికి గాయాలు అయ్యాయ‌ని..  ప్రశాంతంగా స్వామిని వేడుకునే కార్యక్రమానికి పిలుపిస్తే పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని నాతో పాటు 19 మందిపై అక్రమ కేసులు బనాయించార‌న్నారు.


నా మీద ఎన్ని కేసులైనా పెట్టుకోండి...
పోలీసులకు నా విజ్ఞప్తి ఒక్కటే... ఈ కార్యక్రమానికి పూర్తి బాధ్యడిని నేను.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీలు, సాధువులు, భక్తులు ఎవరిమీద కేసులు పెట్టవద్దు ... నా మీద ఎన్ని కేసులు పెట్టినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను ... మిగిలిన 19 మంది పేర్లు తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నట్టు ఆయ‌న తెలిపారు. నిన్న జరిగిన విధ్వంసానికి పూర్తి బాధ్యత తిరుపతి ఎస్పీ మనోహర్ గారిది ... ఆయ‌న‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో జరుగుతున్న మద్యం వ్యాపారాలు.. మాంసం విక్రయాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల‌న్నారు. భ‌క్తులు, స్వామీజీలపై చూపించే ప్రతాపం తిరుమలలో జరుగుతున్న అన్యాయాలపై చూపించాల‌ని... ఈ సంఘటనకు కారణమైన ఏఎస్పీ మనోహర్ గారిని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాన‌ని రామ‌చంద్ర యాద‌వ్ కోరారు. తిరుమలకు రోజు కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు... వారిని అవ‌మానించేలా మాట్లాడితే అది కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంద‌న్నారు.  ఇలాంటి అధికారులు తిరుమల లాంటి పవిత్రమైన నగరంలో విధులు నిర్వహించడానికి ఎంత మాత్రం అర్హులు కాద‌ని రామ‌చంద్ర యాద‌వ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.


మూడు డిమాండ్లు... వారం రోజులు :
తాను ప్రధానంగా కోరిన మూడు డిమాండ్లను ఏడు రోజుల్లో నెరవేర్చాల‌ని... తిరుమల అలిపిరి పాదాల వద్ద ఉన్న స్థలాన్ని ప్రైవేటు హోటల్స్‌కు కట్టబెడుతూ ఇచ్చిన జీవో నెంబర్ 24 ర‌ద్దుచేసి వెంటనే తిరుమలకు ఇచ్చి భ‌క్తుల సౌక‌ర్యం కోసం వాడాల‌న్నారు. ఇక రెండో డిమాండ్‌గా గతంలో ముఖ్యమంత్రి గారు కల్తీ నెయ్యి వల్ల లడ్డూలలో అపచారం జరిగిందని ఆరోపించారు ..  దీనికి శాశ్వత పరిష్కారం కోసం టిటిడి ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయాల‌ని... ఇందుకోసం తాను పూర్తిగా సహకరిస్తాన‌న్నారు.
టిటిడి ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు సాధ్యమవుతుందా కాదా ? అన్నది కూడా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయాల‌న్నారు. ఇక మూడో డిమాండ్‌గా తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఉన్న విఐపి ప్రోటోకాల్ ఎత్తివేసి అందరికీ ఒకే దర్శన సౌకర్యం కల్పించాల‌ని కోరారు.


చంద్ర‌బాబు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలి...
ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల నుంచి నా ప్రక్షాళన మొదలు పెడతా అని చెప్పారు.. ఆయ‌న‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాన‌ని..  ఇప్పటికే తిరుమలలో జరిగిన తప్పులు.. అపచారాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి... మా డిమాండ్లు నెరవేర్చ‌ని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్ర‌భుత్వానికి కనువిప్పు కలిగి ప్రక్షాళన చేసేవరకు పోరాడటం ఆప‌మ‌న్నారు.


లోకేష్ కూడా ఆలోచ‌న చేయాలి...
తిరుమ‌ల విష‌యంలో మంత్రి నారా లోకేష్ కూడా నిర్ణయం తీసుకోవాల‌ని... కొద్దిరోజుల క్రితం కాశీనాయన ఆశ్రమం విషయంలో ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకునేలా లోకేష్ చేశార‌ని.. ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న అపచారాలు... అన్యాయాల గురించి మీరు స్పందించి ఇక్క‌డ కూడా ప్రక్షాళన చేపట్టాలని కోరుతున్నామ‌న్నారు.


ప‌వ‌న్‌తో ఉప‌యోగం లేదు...
ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి నేను పుట్టాను అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయాలని అనుకోవడం లేద‌ని రామ‌చంద్ర యాద‌వ్‌ ఎద్దేవా చేశారు. ప‌వ‌న్‌ సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి మరో కార్యక్రమం వైపు వెళుతున్నారు ...  రాష్ట్రంలో హిందూయిజం విష‌యంలో ఎవరికి ఏ ఇబ్బంది ? వచ్చినా పవన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు .. ప‌వన్ సనాతన ధర్మాన్ని వదిలి పెట్టేసార‌ని తీవ్రంగా విమ‌ర్శించారు.


ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగ‌దు....
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలు, దళితులపై దాడులు జరుగుతున్నాయి వీరు త‌రతరాలుగా అణిచివేతకు గురి చేయబడుతున్నారు.. అలాగే  అత్యధిక శాతం జనాభా అనుసరిస్తున్న హిందూ మతాన్ని కూడా వెనుకబడిన మతంగా ప్రభుత్వాలు చూస్తున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. చివ‌ర‌గా ఈ రాష్ట్రంలో బీసీలు, దళితులు, హిందువులు, మహిళలు, యువతకు ఎవరికి అన్యాయం జరిగినా బీసీవై పార్టీ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని.. ఈ విష‌యంలో త‌న‌ను ఇబ్బందులు పెట్టినా... ఎన్ని అక్రమ కేసులు పెట్టిన పోరాటం ఆగ‌ద‌ని ఆయ‌న తెలియ‌జేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: