
ప్రభుత్వ ఉద్యోగులు ఆకాశం నుంచి ఊడిపడరు. కాలం కలిసొచ్చినప్పుడు కొందరు వెలుగులోకి వస్తారు, సమయం సహకరించనప్పుడు మరికొందరు తెరమరుగవుతారు. అంతే కానీ వ్యవస్థ మొత్తం ఉద్యోగులు లేకుండా నడవదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఉద్యోగులు పనిచేయక తప్పదు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులందరినీ పక్కన పెడితే వ్యవస్థ ఎలా నడుస్తుంది?
ఒకవైపు ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంటే, దానిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత టీడీపీ సోషల్ మీడియాపై ఉంది. కానీ, జరుగుతున్నదేమిటి? ప్రభుత్వ కార్యక్రమాలను ప్రమోట్ చేయడం మానేసి, సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించడం, సొంత కార్యకర్తలే నెగిటివ్ ప్రచారం చేయడం విడ్డూరంగా మారింది. ఈనాడు, జ్యోతి వంటి పత్రికలు సైతం సొంత పార్టీని విమర్శిస్తున్నట్లుగా, టీడీపీ సోషల్ మీడియా తీరు ఉండటం గమనార్హం.
ఇప్పటికే రాష్ట్రంలో హింసా రాజకీయాలు పెరిగిపోయాయని ప్రజలు ఆందోళన చెందుతుంటే, టీడీపీ సోషల్ మీడియా మాత్రం మరింత రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తోంది. "వాడిని ఎందుకు చంపలేదు? వీడిని ఎందుకు పొడవలేదు? వాడిని ఎందుకు కొట్టలేదు?" అంటూ కార్యకర్తలే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీని ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నామనేది ఆలోచించాల్సిన విషయం.
పార్టీ ఎదుగుదలలో, ప్రభుత్వం స్థిరత్వంలో సోషల్ మీడియా పాత్ర ఎంతో కీలకం. అలాంటిది అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టి, సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఏ సమయంలో ఏం చేయాలో, ఎలా చేయాలో పార్టీ అధినేతలకు తెలియదా?
అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే ప్రజాగ్రహం పెరుగుతుందని, రేపు పొద్దున ప్రభుత్వం మారితే ప్రతీకార దాడులు జరిగితే కార్యకర్తలను కాపాడుకోవడం కష్టమని టీడీపీ పెద్దలకు తెలియనిది కాదు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అత్యంత ఉన్మాదంతో ప్రవర్తించిన వారిని వదిలిపెట్టేది లేదు. కానీ విమర్శించే వారిని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని అందరినీ శత్రువులుగా చూస్తే, దాడులకు పాల్పడితే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికైనా టీడీపీ సోషల్ మీడియా విభాగం సరైన వ్యూహంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.