
రామకృష్ణ ఆత్మకు శాంతి కలగాలని.. వారి కుటుంబానికి మనోధర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని.. ఆయన హత్య తర్వాత ఆయన కుటుంబం ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతోందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు అన్ని ఒక ఎత్తు అయితే... పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన రౌడీ రాజకీయాలు, దౌర్జన్యాలు మరో ఎత్తు అని.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో ఇప్పటికీ పెద్దిరెడ్డి కుటుంబం చేతుల్లో అధికారం ఉందని చెప్పటానికి ప్రత్యక్ష ఉదాహరణ రామకృష్ణ గారి హత్య అని రామచంద్ర యాదవ్ ఆరోపించారు.
రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో హత్య రాజకీయాలు జరుగుతాయని ఈ సంఘటన ద్వారా పెద్దిరెడ్డి అందరికీ సవాల్ విసిరారన్నారు. ఈ హత్యలో వ్యక్తిగత కోణం లేదు.. కేవలం ప్రజలను, ప్రత్యర్థులను భయపెట్టేందుకే పెద్దిరెడ్డి ఈ పని చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పెద్దిరెడ్డి అక్రమాలపై ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు ఈ రోజు ఆయనపై సాక్ష్యాలు ఉన్నా కూడా ఎందుకు చర్యలు ? తీసుకోవడం లేదని... చంద్రబాబుకు, పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న చీకటి ఒప్పందం వల్లే ఇదంతా జరుగుతుందని రామచంద్ర యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎంపీ మిథున్‌రెడ్డిపై లిక్కర్ అవినీతితో పాటు అన్ని సాక్ష్యాలు ఉన్నా ఎలాంటి చర్యలు లేవన్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని.. చంద్రబాబు అధికారంలో ఉన్నా చోద్యం చూస్తున్నారే తప్పా పెద్దిరెడ్డిని ఏం చేయలేకపోతున్నారన్నారు. ఈ సంఘటన తప్పుదోవ పట్టించేందుకు కొందరు పోలీసులపై చర్యలు తీసుకుని మమః అనిపించేశారని... ఈ హత్యకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబే తీసుకోవాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. వెంటనే చంద్రబాబు పెద్దిరెడ్డి కుటుంబం, ఆయన బినామీల మీద చర్యలు తీసుకుని.. నిందితుల ఆస్తులు స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.