ఆ వ్యక్తి ఏమన్నాడంటే తన భార్య పోర్న్ చూడటం, హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల తను చాలా బాధపడుతున్నానని చెప్పాడు. అంతేకాదు, ఆమె డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుందని, ఇంటి పనులు చేయదని, ఇంకా ఆమెకి ఏదో జబ్బు కూడా ఉందని ఆరోపించాడు. కానీ కోర్టు మాత్రం ఆమెకి ఎలాంటి జబ్బు లేదని తేల్చేసింది. జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ ఆర్. పూర్ణిమతో కూడిన మధురై బెంచ్ ఈ తీర్పుని వెలువరించింది.
కోర్టు ఏం చెప్పిందంటే, ఎవరైనా ప్రైవేటుగా పోర్న్ చూస్తే అది నేరం కాదు అని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ అలవాట్లు భార్యాభర్తలుగా తమ బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుపడకపోతే, వాటిని హింసగా చూడలేమని తేల్చి చెప్పింది. అంతేకాదు, హస్త ప్రయోగం గురించి ఒక మహిళని నిలదీయడం అనేది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించడమే అవుతుందని కోర్టు గట్టిగా చెప్పింది. హస్త ప్రయోగం చేసుకోవడం సిగ్గుపడాల్సిన విషయం కాదని, మగవాళ్లు చేసుకుంటే ఒకలాగా, ఆడవాళ్లు చేసుకుంటే ఇంకోలాగా చూడటం కరెక్ట్ కాదని కోర్టు తెలిపింది. పెళ్ళికి వెలుపల వేరే వాళ్ళతో శారీరక సంబంధాలు పెట్టుకుంటే అది విడాకులకి కారణం అవుతుంది కానీ, సొంతంగా ఆనందించడం విడాకులకి కారణం కాదని కోర్టు తేల్చి చెప్పింది.
ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, పెళ్లి అయినా సరే అది పోదు అని కోర్టు గట్టిగా చెప్పింది. ఒక మహిళకి పెళ్లి తర్వాత కూడా తన సెక్సువల్ విషయాల్లో తన ఇష్టం ఉంటుందని, ఆమె వ్యక్తిత్వం అలాగే ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. చట్టాన్ని ఉల్లంఘించనంత వరకు ఎవరి వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించకూడదని కోర్టు తెలిపింది. ఇంతకుముందు 2024లో జస్టిస్ స్వామినాథన్ ఇచ్చిన తీర్పుని కూడా కోర్టు గుర్తు చేసింది. భార్యాభర్తల మధ్య వ్యక్తిగత గోప్యత అనేది చాలా ముఖ్యమని, హస్త ప్రయోగం చేసుకోవడం అనేది తప్పు కాదు, హింస కాదు, దానివల్ల పెళ్లి బంధం బలహీనపడదని కోర్టు ఈ తీర్పులో స్పష్టం చేసింది.