
ఏపీలో రాజకీయాలు రోజు కో రకంగా మారుతూ వస్తున్నాయి. నియోజకవర్గాల్లో పార్టీల వ్యవహారం.. ఆసక్తి గా కూడా మారుతోంది. నగరి నియోజకవర్గంలో ఉప్పు - నిప్పుగా ఉన్న వైసీపీ వర్సెస్ టీడీపీ గురించి లెక్కలేనన్ని వార్తలు వస్తున్నాయి. అయితే పరిస్థితులు ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నట్టు గా ప్రచారం జరుగుతోంది. నీకది .. నాకు అది అన్న చందంగా నాయకులు మిలాఖత్ రాజకీయాలకు తెరలేపారని అంటున్నారు. ఇది నిజమే అని రెండు పార్టీల్లోనూ చర్చ నడుస్తోంది.
నగరి నియోజకవర్గంలో రెండు సార్లు విజయం దక్కించుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా జగన్ ప్రభుత్వం లో మంత్రి కూడా చివరి రెండున్నర సంవత్సరాలు పని చేశారు. ఆమె ఇటీవల కీలక టీడీపీ నాయకులను టార్గెట్ గా చేసుకుని నిరంతరం నిప్పులు .. విమర్శలు కురిపించే వారు. ఆ పరిస్థితి ఉన్న అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి ఓడిపోయిన నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. గుడివాడ , గన్నవరం నియోజకవర్గాలే ఇందుకు నిదర్శనం.
అయితే నగరిలో మాత్రం రోజా ఫైటింగ్ పవర్ తగ్గలేదు. ఇందుకు ఓ విచిత్రమైన వాదన తెరమీదకు వస్తోంది. టీడీపీలోకి కొందరు నాయకులతో రోజా మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారట. ఈ చర్చ టీడీపీలో నే నడుస్తోంది. రోజా మంత్రి గా ఉన్నప్పుడు తమిళనాడు - ఏపీ సరిహద్దులోని వడమాలపేట మండలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ ప్లాన్ చేశారు. ఇది పూర్తి కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీ నాయకులు చేపట్టిన నిర్మాణాలు చాలా చోట్ల నిర్మాణాలు నిలిచిపోయాయి.
కానీ విచిత్రం ఏంటంటే రోజా చేపట్టిన నిర్మాణానికి అనుమతులు.. సహా.. పనులు కూడా నిర్విరామంగా జరిగిపోతున్నాయట. మరో ట్విస్ట్ ఏంటంటే రోజా మంత్రి గా ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో చేపట్టిన అన్న క్యాంటిన్ ఇప్పటకీ నడుస్తోంది. దీనికి విరాళాలుకూడా జోరుగా అందుతున్నాయి. ఇలా.. రోజా హవా ఏమాత్రం తగ్గలేదని.. దీనికి కారణం మిలాఖత్ రాజకీయాలేనని ... టీడీపీ కూడా రోజా విషయంలో చూసి చూడనట్టు ఉంటోందని అంటున్నారు.