
ఏపీ రాజకీయాలు ఎలా లేదన్నా కులాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఏపీలో కుల రాజకీయాలు బాగా పాతుకు పోయాయి. అక్కడ ఓట్లు వేసే ఓటర్లు కూడా మన కులం వాడే నా .. అన్నది కూడా చూసుకునే చాలా వరకు ఓట్లు వేస్తూ ఉంటారు. ఏపీలో కొన్ని సామాజిక వర్గాలు రాజకీయంగా కొన్ని పార్టీలకు కొమ్ము కాయడం క్రమంగా జరుగుతూ వస్తోంది. ఈ సామాజిక వర్గాల ఓట్లే ఎన్నికల్లో ఆయా నేతల తల రాతలను మారుస్తున్నాయి.
అందుకే రాజకీయ పార్టీలు తమ కు ఎంత పలుకు బడి ఉన్నా.. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా పలుకుబడి .. బలం ఉన్న కులాలకు చెందిన నేతలను మచ్చిక చేసుకోవడమో లేదా .. లాలించడమో లేదా పదవులో లేదా పరకో ఇవ్వడమో చేసి తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. వైసీపీ బీసీ వర్గాలకు చెందిన తెలంగాణ నాయకుడు ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇవ్వడం వెనక ఇదే వ్యూహం దాగి ఉంది. అయితే ఆయన ఆ పార్టీకి ఎంత వరకు ప్లస్ అయ్యాడు అన్నది తర్వాత ప్రశ్న.
ఇదిలా ఉంటే ఏపీలో బలంగా ఉన్న కాపులు ఇప్పుడు వైసీపీకి పూర్తిగా దూరమైన పరిస్థితి. 2019 ఎన్నికల్లో కాపులు టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారు. అలాగని కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన వైపు కూడా పెద్దగా మొగ్గు చూపలేదు. వైసీపీ కి వన్ సైడ్‌గా ఓట్లేశారు. కట్ చేస్తే 2024 ఎన్నికలకు వచ్చే సరికి కాపుల్లో 90 - 95 శాతం మంది జగన్ .. వైసీపీకి పూర్తిగా దూరమైపోయారు. పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ఫలితంగానే కాపులు దూరమయ్యారన్న ప్రచారం ఉంది. అందుకే ఇటీవల జగన్ సైతం పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కాస్త తగ్గించారు. దీనికి తోడు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను మండలికి పంపించారు. అయినా కూడా కాపుల్లో ఎందుకో జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ పరిస్థితి మారకపోతే తమకు ఇబ్బందే అని వైసీపీలో ఉన్న కాపు నేతలు గుసగుస లాడుకుంటున్నారు.