
ఏపీ విపక్షం వైసీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న పరిస్థితి వచ్చేసింది. అసలే గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం అయ్యింది. 2019 ఎన్నికలలో వైసీపీ ఏకంగా 151 సీట్లు సాధించి భారీ మెజార్టీ తో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జగన్ పదే పదే వైనాట్ 175 కుప్పం , హిందూపురం కూడా కొట్టబోతున్నాం అంటూ ప్రచారాన్ని ఊదరగొట్టే శారు. కట్ చేస్తే సాధారణ ఎన్నికల్లో జనాలు జగన్ ను కేవలం 11 సీట్లకు పరిమితం చేసి కూర్చో పెట్టేశారు. ఎప్పుడు అయితే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందో ఆ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు బయటకు వచ్చేస్తున్నారు. అసలు రాజ్యసభ సభ్యులు గా ఉన్న వారు మాత్రమే కాదు... ఎమ్మెల్సీ లు... జిల్ల పార్టీ అధ్యక్షులు .. గతంలో మంత్రలుగా ఉన్న వారు సైతం బయటకు వచ్చేస్తున్నారు.
చాలా మంది జనసేన లేదా టీడీపీలో చేరిపోతున్న పరిస్థితి ఉంది. ఇక మండలిలో వైసీపీకి మంచి బలం ఉంది. ఈ బలంతో ప్రభుత్వాన్ని చాలా వరకు ఇరుకున పెట్ట వచ్చు అని జగన్ భావించారు. అయితే ఎమ్మెల్సీలు వరుస పెట్టి జగన్‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. 58 మంది సభ్యులున్న మండలిలో వైసీపీకి 35 మంది సభ్యులు ఉన్నారు. అయితే మండలి లో వైసీపీ వికెట్లు వరుస పెట్టి టపా టపా పడిపోతున్నాయి. తాజాగా చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ కూడా పార్టీకి .. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేశారు.
విశ్లేషకుల అంచనా ప్రకారం.. వచ్చే ఏడాదికి మరో 10 నుంచి 15 మంది ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి జారి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే.. వైసీపీ బలం మరింత తగ్గపోతుంది. అసెంబ్లీ లో ఎలాగూ వైసీపీకి బలం లేదు. కనీసం గట్టి పట్టు ఉందనుకున్న మండలి నుంచి కూడా ఆ పార్టీ ఎమ్మెల్సీలు వరుసగా జారి పోతున్న నేపథ్యంలో మునిగిపోతున్న పడవను తలపిస్తోందని అంటున్నారు. కూటమి రాజకీయ వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కొనకపోతే.. వైసీపీ మరింత డైల్యూట్ అవ్వడం ఖాయం.