
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. జనసేన స్థాపింఇ పదేళ్లు దాటేసింది. 2014 ఎన్నికలకు కాస్త ముందుగా జనసేన పార్టీ స్థాపించిన పవన్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. ఇక 2019 ఎన్నికల్లో పవన్ ఒంటరిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యేగా కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారు. అసలు జనసేన రాజోలు లో మాత్రమే విజయం సాధించింది. ఇక 2024 ఎన్నికల్లో మాత్రం పవన్ బీజేపీ - తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కూటమి గా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. పవన్ ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యే గా ఉండడంతో పాటు అటు కీలక శాఖలకు మంత్రి గాను.. ఇటు ఉప ముఖ్యమంత్రి గాను కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే తాజా గా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోనూ జనసేన పార్టీని విస్తరిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. తంతి టీవీకి ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్యూ లో ఈ విషయం తెలిపారు. తమిళంలో అనర్గళంగా మాట్లాడగలిగే పవన్ కల్యాణ్ ను తమిళ్‌లోనే ఇంటర్యూ చేయగా ఆయన పలు విషయాలు తెలిపారు. ఇక పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో పవన్ హిందీ విషయంలో చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు.
ఇక బలవంతంగా హిందీ నేర్పించాలనే విధానానికి కూడా తాను వ్యతిరేకం అన్నారు. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడానికి లేని భయం దేశంలోని హిందీ భాష నేర్చుకునేందుకు ఎందుకన్నదే పవన్ వేసిన ప్రశ్న. ఇక నియోజకవర్గాల పునర్విభజన పేరుతో సౌత్ రాష్ట్రాలకు సీట్లు తగ్గదని తాను నమ్ముతున్నానన్నారు. తమిళ ప్రజలు ఆదరణ చూపిస్తే తమిళనాడులో కూడా జనసేనను రంగంలోకి దింపుతామని పవన్ చెప్పారు.