- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .


ఏపీ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశం లో భాగంగా  రెవెన్యూ సమస్యల పరిష్కార మార్గాలు పై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప‌లు అంశాల‌పై మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే ఏపీలో ఇళ్లు క‌ట్టుకునే వారికి ఏపీ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఎజెండా అన్నారు. గ‌త ప్ర‌భుత్వం ప‌ల్లెల్లో అయితే సెంటున్నర‌, ప‌ట్ట‌ణాల్లో కేవ‌లం సెంటు మాత్ర‌మే ఇచ్చింది. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వ‌డం మంచి విష‌యం అంటున్నారు. అలాగే ప‌ట్ట‌ణ‌ల్లో 2 సెంట్లు అంటే పేద‌ల‌కు ఎంతో ల‌బ్ధి చేకూరుతుంద‌నే చెప్పాలి. ఇక వ‌చ్చే 5 సంవత్సరాల కాలంలో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలని ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్ర‌బాబు తెలిపారు.


ఇది వరకే లబ్ది పొందిన వారి అభిప్రాయాలను సేకరించి వారు కోరిన విధంగా ఇంటి పట్టాలను కాని, దానికి సంబంధించిన ఆర్థిక వనరులను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు అన్ని విధాలా లబ్ది చేకూర్చే మార్గాలను ఆలోచించాలన్నారు.
రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి కాని వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదని బాబు తెలిపారు. ఇక  రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతకాలి కాని సమస్యలను క్లిష్టతరం చేయొద్దని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. భూమి అనేది ప్రజలకు సంబంధించిన సున్నితమైన అంశమని దాన్ని క్లిష్టతరం చేసి ప్రజల తిరస్కారానికి గురికావద్దు అని హెచ్చరించారు.


ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ రికార్డులు చాలా వరకు సరళంగా ఉండేవని గత ప్రభుత్వంలో  జరిగిన అవకతవకలు, రికార్డులను తారుమారు చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నం అయ్యాయన్నారు. కేవలం భూ సంబంధిత సమస్యలు మాత్రమే 60 నుంచి 70 శాతం ఉన్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో  ఈ విధంగా రెవెన్యూ సమస్యలు ఉత్పన్నం అవడానికి గల కారణాలు ఏంటి అని అధికారులను ప్రశ్నించారు. త్వరితగతిన భూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాల వారీగా సంబందిత కలెక్టర్లు, అధికారులు భూ సమస్యలు పరిష్కార ప్రక్రియ ఏ విధంగా చేపడుతున్నారో అడిగి తెలుసుకోవడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి పలు జిల్లాల కలెక్టర్ల నుండి సలహాలు సూచనలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: