ఆంధ్రా రాజకీయ యవనికపై 'యూటర్న్' అనే పదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకూ వాలంటీర్లే మా హీరోలు, వారికి పదివేలిస్తాం, బంగారు భవిష్యత్ చూపిస్తాం అని ఊదరగొట్టిన గొంతులే, ఇప్పుడు ప్లేట్ మార్చేశాయి. అసలు వాలంటీర్ వ్యవస్థనే జగన్ భ్రష్టు పట్టించాడంటూ పాత పాటే అందుకున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ గాల్లో తేలిపోయి, నిరుద్యోగ వాలంటీర్ల ఆశలు అడియాశలయ్యాయి.

ఇక సచివాలయాల సంగతి సరేసరి. వాటిని మరింత పదును పెట్టి ప్రజలకు చేరువ చేస్తామన్న మాటలు అధికార పీఠం ఎక్కగానే ఆవిరయ్యాయి. ఇప్పుడు వాటిని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు పడుతున్నాయనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. పాలనను ప్రజల ముంగిటకు తెచ్చిన వ్యవస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

పెన్షన్ల పంపిణీలోనూ అదే తీరు. ఇంటికే పెద్దన్నలా వస్తాం, మీ చేతిలో పెన్షన్ పెడతాం అని చెప్పి, ఇప్పుడు లబ్ధిదారులను ఎక్కడో వీధి చివర నిలబెట్టి, 'ఇదిగో తీసుకో' అన్నట్లు వ్యవహరించడం మొదలైంది. వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు చూడలేని పరిస్థితి. మాట నిలబెట్టుకోవడం అంటే ఇదేనా అని జనం నిలదీస్తున్నారు.

తాజాగా, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై ప్రభుత్వం వేసిన పిల్లిమొగ్గ మరో సంచలనం. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 62 ఏళ్ల సర్వీస్ అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మోత మోగించి, తీరా అధికారంలోకి వచ్చాక అది కేవలం రెగ్యులర్ ఉద్యోగులకేనని తేల్చిచెప్పారు. అంటే, వేలాది మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవలు ప్రభుత్వానికి అవసరం లేదా? వారి స్థానంలో 'మనవాళ్లను' నియమించుకునే వ్యూహంలో భాగమేనా ఈ నిర్ణయం అనే అనుమానాలు బలపడుతున్నాయి.

ఇక ఆర్భాటంగా ప్రకటించిన 'సూపర్ సిక్స్' పథకాల ఊసే లేదు. అధికారంలోకి రాగానే అమలంటూ చేసిన శపథాలు గాలికి కొట్టుకుపోయాయా? వాటి అమలుకు ఏడాదైనా పడుతుందా లేక అసలు అమలవుతాయా అన్న స్పష్టత కరువైంది.

విచిత్రమేమిటంటే, నిన్నటి ప్రతిపక్ష నేత పాలనలో చిన్న ఆలస్యం జరిగితేనే పేజీలకు పేజీలు విమర్శనాస్త్రాలు సంధించిన కొన్ని మీడియా సంస్థలు, ఇప్పుడు ఈ భారీ యూటర్న్‌లపై, అడ్రస్ లేని హామీలపై 'మౌనవ్రతం' పాటిస్తున్నాయి. వారి కలాలకు అధికార పార్టీపై ప్రేమ ఎక్కువైందా లేక ప్రజల సమస్యలు పట్టడం మానేశాయా అనేది అంతుచిక్కని ప్రశ్న.

మొత్తానికి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక గాలికొదిలేయడం, మాట మార్చడం వంటి పరిణామాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ 'రివర్స్ గేర్' పాలన ఎటువైపు దారితీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: