
ఏ ముహూర్తాన సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారో గాని నాటి నుంచి నేటి వరకు ఆ పార్టీకి అసలు తిరుగు లేకుండా పోయింది. తెలుగు ప్రజల హృదయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా ఈ పార్టీకి చెక్కు చెదరని స్థానం ఏర్పడింది. తెలుగు దేశం అంటేనే తెలుగు ప్రజలకు ఓ సెంటిమెంట్ గా మారింది. కొన్నిసార్లు ఈ పార్టీ కింద పడిపోయినా అంతే స్పీడ్ తో పైకి లేచి తన పట్టు ఎప్పటకి తగ్గదని .. తెలుగు గడ్డ పై తెలుగు దేశానికి ఎన్నటకీ క్రేజ్ తగ్గదని ఫ్రూవ్ చేసుకుంది. ఇక ఈ రోజు తో తెలుగుదేశం పార్టీకి 43 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా తెలుగుదేశం అభిమానులు సంబరాలు చేసుకుంటూ పార్టీ పండగ చేసుకుంటున్నారు.
తెలుగుదేశం ఆవిర్భవించి 43 ఏళ్లు అయిన సందర్భంగా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు .. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పార్టీ ఆవిర్భావం ముహూర్తాన్ని ఎన్టీఆర్ పెట్టిన బ్రహ్మ ముహూర్తంగా చెప్పారు.
ఎన్టీఆర్ ఏ బ్రహ్మ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ స్థాపించారో కాని.. ఆ పార్టీ తెలుగు రాజకీయాల దశనే మార్చడం కాదు.. తెలుగు ప్రజల తల రాతలను మార్చేసి.. తెలుగు జాతి ఖ్యాతిని నలు దిశలా చాటి చెప్పిన పార్టీగా రికార్డుల్లో నిలిచిపోయిందన్నారు.
అంతే కాదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిని, ఇక్కడ ప్రజల తలరాతలను మార్చి వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుతో పాటు, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం.. వచ్చే నెల నుంచి ఉమ్మడి జిల్లాలో రు. 30 వేల కోట్ల వ్యాపారం జరిగే అక్వా రంగానికి యూనిట్‌కు రూపాయిన్నరకే ఇస్తున్నాం... మెట్ట ప్రాంతంలో ఫామాయిల్, పొగాకు పంటల సాగుకు పూర్తి ప్రోత్సాహాలు ఇస్తాం... ఈ ఐదేళ్లు పూర్తయ్యే సరికి జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం అని కూడా గన్ని తెలిపారు.
ఇక 2019లో రాష్ట్రంలో పార్టీ ఘోర పరాజయం.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి, పాలకొల్లులో మాత్రమే గెలవడంతో జిల్లాలో పార్టీ ఎన్నో కష్టాలు చూసింది. చాలా మంది కీలక నాయకులు పార్టీని వదిలేశారు. అయినా మిగిలిన నాయకులు, కేడర్ కసితో పనిచేసి జనసేన, బీజేపీతో కలిసి 2024లో ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు జిల్లా అంతటా పార్టీ కేడర్‌లో ఎక్కడా లేని జోష్ నెలకొందని .. ఐదేళ్లలో మరింతగా జిల్లాను అభివృద్ధి చేసుకుంటాం అన్న ధీమాతో పార్టీ నాయకులు ఉన్నారు.