
పశ్చిమ గోదావరి జిల్లాలో వేసవి తాగునీటి సమస్యలను ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు తీసుకోవడం పై ప్రత్యేక దృష్టి సారించేందుకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ని ఆమె క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సౌకర్యాల పెంపు, కొత్త బోర్లు, డ్రైనేజ్ల నిర్మాణంపై ఆమెతో చర్చించారు.
వేసవి తాగునీటి సమస్యల నివారణకు చర్యలలో భాగంగా వేసవి కాలంలో పలు గ్రామాల్లో తాగునీటి కొరత తలెత్తే అవకాశం ఉందని.. జిల్లా పరిషత్ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ని ఎమ్మెల్యే వెంకటరాజు కోరారు. ప్రత్యేకించి నీటి లభ్యత తక్కువగా ఉన్న గ్రామాల్లో తాగునీటి కోసం కొత్త బోర్లు తవ్వించాల్సిన అవసరం ఉందని వివరించి జలమండలి , గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ సహకారంతో వేగంగా తాగునీటి సమస్య పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. తన నియోజకవర్గం లో వేసవి ఎద్దడి లో ప్రజలు మంచి నీటి విషయంలో ఇబ్బందులు పడకుండా చూడాలని కూడా మద్దిపాటి కోరారు.
అదే విధంగా, వర్షపు కాలంలో నీరు నిల్వ ఉండకుండా, పారుదల సక్రమంగా జరిగేందుకు కొన్ని గ్రామాల్లో డ్రైనేజ్ల నిర్మాణం కూడా అత్యవసరమని తెలిపారు. ఆ సూచనలకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సానుకూలంగా స్పందిస్తూ, జిల్లా పరిషత్ సీఈవో మరియు సంబంధిత శాఖల అధికారులను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. అందుకోసం అవసరమైన నిధులను కేటాయించేందుకు చర్యలు తీసుకునే విధంగా, వేసవి కాలానికి ముందే ప్రణాళికను అమలు చేసి, ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా పరిషత్ ద్వారా వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, నీటి అవసరాలు, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వేసవి తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలో ఎక్కడా నీటి కొరత సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని పద్మశ్రీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ సంబంధిత శాఖల అధికారులు, పాల్గొన్నారు.