పసుపు జెండా మనకు ఎమోషన్…43 ఏళ్ల ప్రయాణం లో ఎన్నో విజయాలు చూసాం, మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం.. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా మాత్రం దించని కేడర్ మనకు మాత్రమే సొంతమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం, మొదటి గెలుపు ఒక చరిత్ర. రాజకీయాల్లో రికార్డులు కొట్టాలన్నా, వాటిని తిరగరాయాలన్నా అది మనకే సాధ్యం. మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడకొట్టాయి. ఆ మూడు అక్షరాలే తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయి. అవి మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం... ఆ ప్రభంజనం పేరే ఎన్టిఆర్.


కరుడుగట్టిన పసుపు సైన్యమే మన బలం
విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసారు.  ఆ ముహూర్తబలం గొప్పది.. పునాది గట్టిది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి తెలిసేలా చేసిన దమ్మున్న నాయకుడు అన్న ఎన్టీఆర్. 43ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ప్రత్యర్ధులు మీద పడుతున్నా మీసం మెలేసి తొడకొట్టిన అంజిరెడ్డి తాత లాంటి కార్యకర్తలు మన ధైర్యం. మెడ మీద కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై టిడిపి, జై చంద్రబాబు అంటూ ప్రాణాలొదిలిన చంద్రయ్య లాంటి కరుడుగట్టిన కార్యకర్తలు మన పౌరుషం. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి రక్తమోడుతున్నా పోలింగ్ బూత్ నుంచి కదలని మంజుల లాంటి కార్యకర్తలు మన  దమ్ము. 43ఏళ్లుగా పార్టీకి, పసుపు జెండాకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి నా పాదాభివందనం.


తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన ఎన్టీఆర్
సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న సిద్ధాంతంతో అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భావం నుండి నేటివరకూ ఎన్నికష్టాలు ఎదురైనా అదే స్పూర్తితో పనిచేస్తున్నాం. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ - దేశానికి అభివృద్ధిని పరిచయం చేసింది మన పేదల పెన్నిధి చంద్రన్న. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలా చేసింది అన్న ఎన్టీఆర్ - తెలుగువారిని ప్రపంచపటంలో పెట్టింది చంద్రన్న. రూ.2 లకే కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్లు, గురుకుల పాఠశాలలు, మహిళలకు ఆస్తిహక్కు, వృద్ధాప్య పింఛను లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి పరిచయం చేసింది టిడిపి. చదువుకున్న యువతకు సీట్లు ఇచ్చింది టిడిపి. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసింది టిడిపి బిసిలకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది టిడిపి. కుల వివక్ష లేకుండా చేసింది టిడిపి.


మనకు గల్లీ తెలుసు... ఢిల్లీ తెలుసు!
మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు - ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉంది. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడూ స్వార్దానికి వాడుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పిన ఏకైక పార్టీ టిడిపి. అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడం లో మన కృషి ఉంది. జిఎంసి బాలయోగి గారిని పార్లమెంట్ కు మొదటి దళిత స్పీకర్ చేసింది మనమే. అంబేద్కర్‌ గారికి భారతరత్న రావడంలో కీలకపాత్ర పోషించాం. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికం, ఐటీ రంగాలు, డిజిటల్ పేమెంట్స్ ఇలా అనేక సంస్కరణలు తీసుకురావడం లో కీలక పాత్ర పోషించాం. తెలుగు దేశం జెండా పీకేస్తాం అని ఎంతో మంది వచ్చారు. అలాంటి వారు అడ్రెస్స్ లేకుండా పోయారు.


అరాచకానికి ఎదురొడ్డాం...ప్యాలెస్ లు బద్దలుగొట్టాం
2019 వరకూ మనం చూసిన రాజకీయం వేరు, 2019 నుండి 2024 వరకూ మనం చూసిన రాజకీయం వేరు. అయిదేళ్లు గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలనను మనం ఎదుర్కొన్నాం. మన దేవాలయం పై దాడి చేస్తే వెన్నుచూపకుండా ఎదురునిలబడ్డాం. మన అధినేత ఇంటికి తాళ్లు కడితే తాళ్లు తెంచుకొని పోరాడాం. క్లైమోర్ మైన్ల కే భయపడని బ్లడ్ మనది. కామిడీ పీసులకు భయపడతామా?  నలుగురు ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం అన్నవారికి ప్రతిపక్ష హోదా లేకుండా ఇంటికి పంపాం. ప్యాలెస్ లు బద్దలు కొట్టాం. 2024 ఎన్నికల్లో మన స్ట్రయిక్ రేట్ 94 శాతం. 58 శాతం ఓట్ షేర్. 8 ఉమ్మడి జిల్లాలు క్లీన్ స్వీప్ చేశాం. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం ఓట్ షేర్ సాధించాం.  ప్రజలు ప్రజా ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. వారి ఆకాంక్ష మేరకే ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: