
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలలో మంత్రి నారా లోకేష్ పలు పంచ్‌లు పేల్చారు. తెలుగుదేశం పార్టీ లో కార్యకర్తే అధినేత. ఈ మాట నేను ఊరికే అనడం లేదు. దేశంలో కార్యకర్తలకు గౌరవం ఇచ్చే ఒకే ఒక్క పార్టీ టిడిపి. మంచి చేస్తే మెచ్చుకుంటారు. తప్పు చేస్తే తాట తీస్తారు. కోటి సభ్యత్వాలు అనేది ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డు. దాన్ని మనం సాధించాం. కేవలం 83 రోజుల్లో కోటి సభ్యత్వాలు నమోదు చేశాం అన్నారు. ఇక
కార్యకర్తల కోసం నేను బయట ఎంత పోరాడతానో పార్టీలో కూడా అంతే పోరాడతాను. నా లక్ష్యం ఒక్కటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులను గుర్తించడమే. గ్రామ స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలి అనేది నా కోరిక. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. రెండు టర్మ్ లు ఒక పదవి చేసిన తరువాత పైకి అయినా వెళ్ళాలి లేదా ఒక టర్మ్ గ్యాప్ అయినా తీసుకోవాలి. ఇది జరిగితే పార్టీలో కదలిక వస్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా 4వససారి పనిచేస్తున్నా. పార్టీలో ప్రక్షాళన నాతోనే మొదలు పెట్టండి. యువకులకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక వస్తుందన్నారు.
ఇక తన స్టయిల్ ఒక్కటే... సీనియర్లను గౌరవిస్తా ... పనిచేసే జూనియర్లకు ప్రమోషన్ ఇస్తా. పార్టీ మరో నలభై ఏళ్లు బ్రతకాలి అంటే కొత్త రక్తం ఎక్కించాలి. దానికి అందరి సహకారం కావాలి. పనిచేసిన వారికే పదవి అనేది నా విధానం. నాయకుల చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరిగే వారికే పదవులు ఇస్తాం. పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తాం. త్వరలోనే అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నాం అని లోకేష్ తెలిపారు.
రెడ్ బుక్ పేరు చెబితే కొందరికి గుండెపోటు
ఇదిలా ఉంటే ఎక్కడికి వెళ్లినా అందరూ రెడ్ బుక్, రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ పేరు చెప్పగానే కొంతమందికి గుండెపోటు వస్తుంది. కొంతమంది బాత్ రూం లో జారిపడి చేతులు విరగ్గొట్టుకుంటున్నారు. అర్దం అయ్యిందా రాజా. అధికారంలో ఉన్నాం అని గర్వం వద్దు, ఇగో వద్దు. అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజల ఆశీస్సులు ఉంటేనే మనం ఉంటామన్న విషయాన్ని కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలి, ప్రజల మనసు గెలిచేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు నిరంతరం శ్రమించాలని లోకేష్ చెప్పారు. అయితే లోకేష్ వేసిన ఈ కౌంటర్లు మాజీ మంత్రి కొడాలి నాని ని ఉద్దేశించి చేసినవే అని తెలుగుదేశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.